TGPSC: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ హెచ్చరిక

TGPSC: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ హెచ్చరిక
X
వన్ టైం రిజిస్ట్రేషన్ అప్ డేట్ చేసుకోవాలని సూచన

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక హెచ్చరిక చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నిరుద్యోగ అభ్యర్థులు తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ OTR వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఓటీఆర్ డేటాను నిర్ణీత గడువులోగా సవరించుకోని అభ్యర్థులు ఇకపై విడుదలయ్యే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోతారని తేల్చి చెప్పింది. నిజానికి ఓటీఆర్ అప్‌డేట్‌కు ఈ నెల 9వ తేదీనే చివరి గడువుగా నిర్ణయించారు. అయితే అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కమిషన్, అభ్యర్థుల సౌకర్యార్థం ఈ గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఇది చివరి అవకాశం అని కమిషన్ స్పష్టం చేసింది. ఈ గడువు దాటిన తర్వాత ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదని తెలిపింది. ఇకపై వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అప్‌డేట్ చేయకపోతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు, దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, తుది ఎంపిక ప్రక్రియ మొత్తం ఓటీఆర్‌లో నమోదైన డేటా ఆధారంగానే జరుగుతుందని కమిషన్ అధికారులు వెల్లడించారు. అందువల్ల అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, కేటగిరీ సంబంధిత సమాచారం సరిగా నమోదై ఉందో లేదో మరోసారి పరిశీలించుకోవాలని సూచించారు. ఇటీవల రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణలో మార్పులు, అభ్యర్థులు సంపాదించిన కొత్త విద్యార్హతలు, చిరునామా మార్పులు వంటి అంశాల నేపథ్యంలో ఓటీఆర్‌లో మార్పులు అవసరమయ్యాయని కమిషన్ పేర్కొంది. అలాగే గత నియామక ప్రక్రియల్లో డేటా లోపాల కారణంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ దశలో ఆలస్యం జరుగుతున్న పరిస్థితిని నివారించేందుకే ఈ అప్‌డేట్ అవకాశం కల్పించినట్లు వివరించింది.

అభ్యర్థులు తమ వద్ద ఉన్న అన్ని విద్యార్హతలను ఓటీఆర్‌లో నమోదు చేయాలని, అదనపు అర్హతలు ఉంటే అవి కూడా తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని సూచించింది. అలాగే తాజా కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను మళ్లీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, అభ్యర్థులు తమ ఉపకులాల వివరాలను కూడా ఓటీఆర్‌లో సవరించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. టీజీపీఎస్సీ గతంలో ప్రవేశపెట్టిన ఓటీఆర్ విధానం ద్వారా అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే తమ పూర్తి వివరాలను నమోదు చేస్తే సరిపోతుందని, ఆ తర్వాత ప్రతీ ఉద్యోగ నోటిఫికేషన్‌కు అదే ఓటీఆర్ నంబర్‌తో లాగిన్ అయి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 31 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఓటీఆర్ నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు..

ఓటీఆర్ అప్‌డేట్ గడువు లోపల తమ వివరాలను సవరించుకోని అభ్యర్థులు రాబోయే నియామక ప్రక్రియల్లో పాల్గొనే అవకాశం ఉండదని కమిషన్ హెచ్చరించింది. ఒక అభ్యర్థికి ఒకే ఓటీఆర్ నంబర్ మాత్రమే ఉండాలని, కమిషన్ లేదా అభ్యర్థి రద్దు చేసే వరకు ఆ ఓటీఆర్ చెల్లుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. కొన్ని ప్రాథమిక వివరాలను ఒకసారి నమోదు చేసిన తర్వాత సవరించేందుకు అవకాశం ఉండదని కూడా వెల్లడించింది. ఓటీఆర్ అప్‌డేట్‌ను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా మాత్రమే చేసుకోవాలని సూచించింది. ఇతర మార్గాలు లేదా మధ్యవర్తులను ఆశ్రయించవద్దని అభ్యర్థులకు హెచ్చరిక జారీ చేసింది.

Tags

Next Story