జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్రస్తుత పాలకమండలిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు-రవీంద్రనాథ్

- గత పాలకమండలి కుట్రలో భాగంగానే కేసు
- సొసైటీ వివరణ తీసుకోకుండానే పోలీసుల ఎఫ్.ఐ.ఆర్
- గత పాలకమండలి అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం
- అక్రమార్కులపై చర్యల కోసం న్యాయపోరాటం చేస్తాం
- 2005 మార్చి నాటి సర్వసభ్యసమావేశం తీర్మానాల ప్రకారమే ప్లాట్ల విక్రయం
- సొసైటీ భూములను ప్రభుత్వ ధరకు మాత్రమే విక్రయించాలి
- మార్కెట్ రేటు ప్రకారం ప్లాట్ల విక్రయాలు సొసైటీలో ఉండవు
- గత పాలకమండలి అనేక ప్లాట్లను అతి తక్కువ ధరకే అమ్మకాలు జరిపింది
- గతంలో జరిగిన అక్రమాలన్నీ బయటపెడతాం-రవీంద్రనాథ్
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్రస్తుత పాలకమండలిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అధ్యక్షులు బొల్లినేని రవీంద్రనాథ్ మండిపడ్డారు. సొసైటీ బైలాస్, జనరల్‌బాడీ మీటింగ్ నిర్ణయాల ప్రకారమే తాము ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. సర్వసభ్య సమావేశం నిర్వహించకుండానే తాము 365 గజాల స్థలాన్ని ఒకరికి అమ్మేశామంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండించారు. పార్కుల స్థలాలు, ఇతర ప్లాట్లు కబ్జాకు గురైంది గత పాలకమండలి హయాంలోనేనని కొన్ని వివరాల్ని ప్రస్తావించారు.
ఏదైనా స్థలం సరైన డైమన్షన్‌లో లేకపోయినా, క్రాస్ బిట్లుగా ఉండడం వల్ల ఆ స్థలాన్ని ఇంకో ప్లాట్‌గా చేసి కేటాయించేందుకు వీల్లేకపోయినా.. సొసైటీ నిబంధనల ప్రకారం వాటిని పక్క ప్లాట్ వారికి ప్రభుత్వ ధరకు విక్రయించే అధికారం పాలకమండలికి ఉంది. దీనిపై 2005 మార్చిలోనే జనరల్ బాడీ తీర్మానం చేసింది. ఇవన్నీ గుర్తు చేసిన సొసైటీ అధ్యక్షులు రవీంద్రనాథ్.. తమపై తప్పుడు ఆరోపణలు చేసే వారు వాస్తవాల్ని గుర్తించి మాట్లాడాలన్నారు. ప్రస్తుతం అమ్మేసినట్టు చెప్తున్న విషయంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగలేదని స్పష్టం చేశారు. తమ ప్లాట్‌కు పక్కనే ఉన్న త్రిభుజాకార స్థలం కోసం సొసైటీ సభ్యురాలు పార్వతీదేవి నుంచి వచ్చిన విజ్ఞప్తిపై.. అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఆ స్థలానికి వెళ్లడానికి వారికి తప్ప ఎవరికీ అవకాశం లేనందున వారికే దాన్ని కేటాయించాలని సర్వసభ్య సమావేశంలో నిర్ణయించామన్నారు. జూబ్లీహిల్స్ సొసైటీలో 1969 నుంచి ఇప్పటి వరకూ జరిగిన రిజిస్ట్రేషన్లన్నీ మార్కెట్ రేటు ప్రకారం కాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన విలువ మేరకే అమ్మకాలు జరిగాయని వివరించారు. ప్రస్తుతం వివాదాస్పదం చేస్తున్న ప్లాట్ విషయంలో తాము ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారమే ముందుకు వెళ్లామన్నారు.
సురేష్‌బాబు ఆరోపిస్తున్నట్టు ఈ స్థలం ఏడున్నర కోట్లకు అమ్మాలనడం పూర్తిగా కుట్రపూరితమైన ఆరోపణే అంటూ కొట్టిపడేశారు. తామేదో అక్రమాలకు పాల్పడ్డట్టు సురేష్ బాబు ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే కేసు నమోదవడం బట్టి చూస్తేనే జరుగుతున్న కుట్ర అందరికీ అర్థమవుతుందన్నారు. తమ వివరణ తీసుకోకుండానే పోలీసులు తొందరపాటుతో తమపై కేసు నమోదు చేసినట్టు కనిపించిందని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని బొల్లినేని రవీంద్రనాథ్ స్పష్టం చేశారు.
గత పాలక మండలి చేసిన అనేక అక్రమాలపై ఇప్పటికే విచారణ పలు దశల్లో ఉందన్నారు జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షులు బొల్లినేని రవీంద్రనాథ్. కొన్ని కేసుల విచారణ కోర్టుల్లో ఉంటే, మరికొన్నింటిని CID విచారణ చేస్తోందన్నారు. పాత పాలకమండలి అక్రమాలన్నింటిపైన అధ్యయనం చేస్తున్నామని, ప్రస్తుతం రికార్డులన్నీ డిజిటలైజ్ చేసే ప్రక్రియ పూర్తికాగానే వారి అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com