అటు కేసీఆర్‌.. ఇటు రేవంత్‌‌‌ను ఢీకొట్టేందుకు 'బండి'కున్న పవర్‌ సరిపోతుందా..?

అటు కేసీఆర్‌.. ఇటు రేవంత్‌‌‌ను ఢీకొట్టేందుకు బండికున్న పవర్‌ సరిపోతుందా..?
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా నియమితులవడంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చింది. టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రేవంత్ సరైనోడని అధిష్టానం పగ్గాలు అప్పగించింది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా నియమితులవడంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చింది. టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రేవంత్ సరైనోడని అధిష్టానం పగ్గాలు అప్పగించింది. ఈ పరిణామం టీఆర్‌ఎస్‌కే కాదు.. బీజేపీకి కూడా సవాల్‌గానే పరిణమించింది. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నయం బీజేపీ అనే విధంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి హవా కొనసాగింది.. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కోల్పోవడం..నాగార్జునసాగర్ లో డిపాజిట్ కోల్పోవడంతో బీజేపీ జోరు కాస్త తగ్గింది. అయితే ఈటెల బీజేపీలో చేరడం.. హుజూరాబాద్ తన పార్లమెంట్ పరిధిలోనిదే కావడంతో బండికి చాలెంజ్ గా మారింది. బీజేపీలో బండి సంజయ్ కి సహాకారం ఏ మేరకు ఉంటుంది. అటు కేసీఆర్‌.. ఇటు రేవంత్ ను ఢీకొట్టేందుకు బండికున్న పవర్‌ సరిపోతుందా..?

ఏ పార్టీకైనా బలమైన నాయకుడు ఉంటేనే ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది. మాస్ ఇమేజ్ ఉంటేనే ప్రజల్లో క్రేజ్ వస్తుంది. అదే కోవకు చెందిన వ్యక్తి నూతన పీసీసీ చీఫ్ రేవంత్. నిన్న మొన్నటి వరకు స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ రాకతో జోష్‌ పెరిగింది. ఇక అటు ప్రస్తుత బీజేపీ రథసారథి బండి సంజయ్ ఏడాది క్రితం వరకు కరీంనగర్ కే పరిమితం.. 2018 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌ను ఓడించడం ద్వారా ఆయన పేరు మారు మోగింది. అప్పటివరకు రాష్ట్ర బీజేపీ సారథులుగా దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ,ఇంద్రసేనారెడ్డి ఇలా నగరానికి చెందిన నాయకులే ఉండేవారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో బీజేపీ ఎదిగేందుకు ప్రయత్నించినా.. టీడీపీ, కాంగ్రెస్‌ ముందు నిలువలేకపోయింది. ప్రదాని మోదీ ఇమేజ్ తో ఎదుగుతారని అనుకున్నప్పటికీ.. 2014 లో ఐదు సీట్లు, 2018లో ఒకే సీటుకు బీజేపి పరిమితమయింది.

రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ ను డీకొట్టే యువనేత కోసం ఆన్వేషణ మొదలుపెట్టారు. సరిగ్గా ఈ తరుణంలోనే కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన బండిసంజయ్ ఒక్క సారిగా స్టార్ అయ్యారు.. బీజేపీని ముందుకు నడిపేందుకు సంజయ్ సరైన వ్యక్తి అని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షుడిగా ఆయనకు ఫస్ట్ టెస్ట్ దుబ్బాక రూపంలో ఎదురైంది. అక్కడ అభ్యర్ది రఘునందన్ రావు స్ట్రాటజీకి బండి సంజయ్ దూకుడు తోడవడంతో .. టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బతగిలింది. రఘునందన్ గెలవడంతో బండి గోల్డెన్ లెగ్ గా పేరుపొందారు. వెంటనే GHMC ఎన్నికల్లో అదే దూకుడుని ప్రదర్శించారు. టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను..క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది.. దీన్ని ఆసరాగా చేసుకున్న బండి సంజయ్ ప్రచారంలో హీట్ పెంచి.. బాగ్యలక్ష్మి టెంపుల్ , ఎంఐఎం పార్టీలే ప్రచార అంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. ఏకంగా 44 స్థానాల్లో గెలిచి సత్తా చాటారు. తొలిసారిగా టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమనే ప్రచారం రాష్ట్రంలో బలంగా తీసుకెళ్లారు. అటు కాంగ్రెస్ అన్ని ఎన్నికల్లో కుదేలవడం.. గెలిచిన ఎమ్మెల్యేలు సైతం టీఆర్ఎస్ లో చేరడంతో .. కాంగ్రెస్ పై ప్రజలకు ఆశలు సన్నగిల్లాయి.

అయితే బండి దూకుడు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలించలేదు.. రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఒక సిట్టింగ్ సీటును కోల్పోయారు. నిరుద్యోగం అంశాన్ని ఎజెండాగా తీసుకున్న గ్రాడ్యుయేట్లు ప్రధాన అభ్యర్దుల మధ్య చీలడంతో ... టీఆర్ఎస్ గట్టెక్కింది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఎన్నికల్లో... జానారెడ్డి కాంగ్రెస్ కు బలమైన అభ్యర్ది కావడంతో ...ముందుగా జానారెడ్డిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేశారు.. ఆయన కుమారుడు రఘువీర్ కు టికెట్ ఇచ్చేందుకు సైతం రెడీ అయ్యారు. అయితే జానారెడ్డి తానే గెలుస్తాననే ధీమాతో కాంగ్రెస్ నుంచి పోటిచేయడం... గిరిజన ఓటర్లు అదికంగా ఉన్నాయని ఆ సామాజికవర్గ అభ్యర్దిని రంగంలోకి దింపినా... చివరికి టీఆర్ఎస్ అభ్యర్ది నోముల భగత్ గెలుపొందారు. బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోయింది. దీంతో కాస్త డీలా పడిన కమల దళంలో ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ జోష్‌ నింపింది. టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన ఈటల... బీజేపిలో చేరడంతో ఇక ఇప్పుడు ఉపఎన్నిక సవాల్ సంజయ్‌ ముందు నిలిచింది. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్‌కు ఎన్నికలు రావడం... ఈటల బలమైన అభ్యర్దిగా రంగంలోకి దిగుతుడంటంతో ... టీఆర్ఎస్ సైతం పట్టుదలతో తన సీటును నిలుపుకునేందుగా ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌ ఎన్నిక అటు ఈటలకు ఇటు బీజేపీ అధ్యక్షునిగా బండిసంజయ్ కి మరో సవాల్ గా మారింది.

కాంగ్రెస్ ఛీఫ్ గా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరేళ్లు ఉన్నప్పటికీ ఏ ఒక్క ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించలేకపోయారు. అటు GHMCలోనూ మూడు స్థానాలకే పరిమితమైంది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుని ఎంపికకు కాస్త సమయం తీసుకున్న అధిష్టానం చివరికి సీనియర్లందరినీ పక్కన పెట్టి ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. 2017 లో కాంగ్రెస్ లో చేరి.. ఎన్నికలకు ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా తో తిరిగినప్పటికి .. ప్రజలు అటు కేసీఆర్ ..ఇటు బీజేపీ రాష్ట్ర న్యాయకత్వం వైపే చూశారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ని పీసీసీ చీఫ్ చేయడంతో .. కాంగ్రెస్ కు పునర్ వైభవం వస్తుందనే చిన్న ఆశ మొదలైంది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో టీడీపీ లో ఎమ్మెల్యేగా కీలక నేతగా ఎదిగిన రేవంత్... 2014 లో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.. టీడీపీ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ లో చేరడంతో...ఇక రేవంత్ కాంగ్రెస్ లో చేరారు..

రాష్ట్రంలో కేసీఆర్ ను టార్గెట్ చేయడంతో పాటు తన వాగ్దాటితో కేసీఆర్ వ్యతిరేక ఓటర్ల అభిమానాన్ని చూరగొన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికి .. పార్లమెంట్ ఎన్నిక్లలో ప్రజలు రేవంత్ ను గెలిపించారు. ఇక ఇప్పుడు పీసీసీ ఛీఫ్ కావడంతో .. సహజంగానే కాంగ్రెస్‌కు ఉండే సంప్రదాయ వోట్ బ్యాంక్ తో పాటు.. బలమైన రెడ్డి సామాజికవర్గం అండదండలు... అటు టీడీపీలోనూ ఉన్న సమయంలో ఉన్న సంబందాలు.. రేవంత్ కు కచ్చితంగా ప్లస్ అవుతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోరు ఉంటుందని భావించినా రేవంత్‌ రాకతో ఇక ట్రయాంగిల్ ఫైట్ తప్పదని విశ్లేషకులంటున్నారు. బండి సంజయ్ మొన్నటివరకు హిందూ ఓటు బ్యాంకు , ఎంఐఎంపై విమర్శలే టార్గెట్‌గా ప్రజల్లో కాస్త ఇమేజ్ సంపాదించారు. ఇక ఇప్పుడు రేవంత్ పీసీసీ ఛీఫ్ కావడంతో... మరో గట్టి సవాల్ ను ఎదుర్కొనబోతున్నారు. ఇప్పటికే కమలనాథులపై రేవంత్ తన దాడిని మొదలు పెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే.. అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పిన బీజేపీ గుండు, బండి ఎటు పోయారని ఎద్దేవా చేశారు..

మరోవైపు బండి సంజయ్ కి దూకుడైన నేతగా పేరు ఉన్నప్పటికీ వ్యూహకర్తగా గుర్తింపు లేదు. రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలవకముందు టీఆర్ఎస్ కేసీఆర్ పై విరుచుకుపడేవాడు. ఎమ్మెల్యే అయ్యాక.. తన లక్ష్యం నెరవేరిందనుకున్న రఘునందన్ రావు సైలెంట్ అయ్యారని.. సొంతపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి సైతం పార్టీ కన్నా ఎక్కువగా హోంమంత్రి హోదాలో అధికారిగా పర్యటనలే జంటనగరాల్లో జరుపుతున్నారు. నాంపల్లి ఆఫీసుకు సైతం రాకుండా.. బర్కత్ పుర ఆఫీస్ కే పరిమితమవుతున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా లక్ష్మణ్ సైతం డిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు.. మురళీదర్‌ రావు ఇతర రాష్ట్రాలకు ఇంచార్జ్ కావడంతో .... డికే అరుణ, వివేక్ , జితేందర్ రెడ్డి , యెన్నం శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలే ప్రస్తుతం బండి సంజయ్ కి కాస్త అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఈటల గెలిస్తే... కచ్చితంగా మరోసవాల్ బీజేపీలో ఉంటుంది. ఉద్యమకారుడు , సీనియర్ నేత కావడంతో పార్టీలో న్యాయకత్వ సవాల్ వస్తుందనే వాదన వినిపిస్తోంది.

బీజేపీ చీఫ్ గా... అటు కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరినవారిని తిరిగి సొంత గూటికి పోకుండా చూడటం... రేవంత్ రెడ్డి, కేసీఆర్ లను తలదన్నే ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాల్సి ఉండడం.. బండి ముందుకున్న ప్రధాన సవాళ్లు. హిందుత్వ నినాదం, మోదీ ఇమేజ్, దూకుడు మంత్రం ప్రస్తుతానికి సంజయ్‌కు ప్లస్ అయినా... 2023 ఎన్నికల్లో అవి ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరమే.

Margam Srinivas

Telangana Bureau Chief

Tags

Read MoreRead Less
Next Story