MLA Kaushik Reddy:కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు

MLA Kaushik Reddy:కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు
X
సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్న ప్రభుత్వం... వెనక్కి తగ్గేదే లేదన్న కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో ఇరువురు పరస్పరం తోసుకున్నారు. అక్కడే ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి సమావేశాన్ని గందరగోళంగా మార్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. అసలు మీరు ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి నిలదీయడంతో గొడవ మొదలైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు సమక్షంలోనే వాగ్వాదం జరుగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


దమ్ముంటే రాజీనామా చెయ్: కౌశిక్ రెడ్డి

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. సంజయ్‌ను నువ్వు ఏ పార్టీ అని అడిగితే కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారన్నారు. అలా అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి చూపించాలని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ పెట్టిన భిక్ష వల్ల నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావని.. అలాంటిది ఆయనపైనే విమర్శలు చేస్తున్నావు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావన్నారు. తాము కచ్చితంగా నిలదీస్తామని.. అడుగడుగునా అడ్డుకుంటామని తెలిపారు.

సీరియస్ యాక్షన్ తీసుకుంటాం

కరీంనగర్ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్‎ మధ్య జరిగిన వాగ్వాదంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పేదవానికి మేలు జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఏ మాత్రం బాగోలేదని ఫైర్ అయ్యారు. పోలీస్‎లు అదుపు చేసిన ఆగకపోవడం దారుణమని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags

Next Story