Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. అదుపులోకి వచ్చిన మంటలు

ఎట్టకేలకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు అదుపులోకి వచ్చాయి. రెండు గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్నిప్రమాదంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని ఏడు బోగీలు కాలిపోయాయి. నాలుగు బోగీలు పూర్తిగా.. మూడు బోగీలు పాక్షికంగా తగలబడ్డాయి. మిగిలిన 11బోగీలకు మరో ఇంజిన్‌ను జోడించి.. సికింద్రాబాద్ తరలించారు.
హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. ఉదయం 11గంటలకు పగిడిపల్లి - బొమ్మాయిపల్లికి చేరుకుంది. అకస్మాత్తుగా ఎస్4 బోగీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో.. లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులంతా రైలు నుంచి కిందికు దిగిపోయారు. ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. రైలు ప్రమాదానికి సిగరేట్ తాగడమే కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. కోల్‌కతా నుంచి వచ్చిన ప్రయాణికులు సిగరేట్లు తాగారని, వద్దని ఎంత వారించినా వినలేదని ఆరోపించారు. వారి వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులకు వివరించారు.
అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానికంగా ఉన్న ఫైర్ ఇంజిన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. సికింద్రాబాద్ నుంచి హుటాహుటిన పగిడిపల్లి చేరుకున్న రైల్వే జీఎం అరుణ్‌జైన్‌కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులను బస్సుల్లో హైదరాబాద్ తరలించారు. అటు రైల్వే ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని సికింద్రాబాద్ సీపీఆర్వో అశోక్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com