ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌కు ముందే బీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు

ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌కు ముందే బీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు
పలు నియోజకవర్గాల్లో భగ్గుమంటున్న విభేదాలు బీఆర్‌ఎస్‌లో తారా స్థాయికి చేరిన టికెట్ల ఫైట్

బీఆర్‌ఎస్‌ ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌కు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. టిక్కెట్‌ గల్లంతేననే సంకేతాలతో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. ముఖ్యమంగా జనగామ.. స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజవర్గాల్లో రెండు గ్రూపులుగా మారిన గులాబీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మాటల మంటలు రేపుతున్నాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో టికెట్‌ తనదేనంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు అక్కడ బీఆర్‌ఎస్‌లో విభేదాలను భగ్గుమనేలా చేశాయి. తానొస్తున్నాని బెంబేలెత్తుతున్నారని.. గోకిన గీకిన వారు భయపడుతున్నారంటూ మాటలతో మంటలు పుట్టించారు కడియం శ్రీహరి. కడియం వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అనుచరులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

అటు.. జనగామలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్సెస్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డిగా మారిపోయింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు రోడ్డెక్కారు. పల్లా వద్దు ముత్తిరెడ్డే ముద్దంటూ నినదిస్తున్నారు. పల్లాకి టికెట్‌ ఇస్తే ఓడిస్తామంటూ వారు హెచ్చరిస్తున్నారు. స్థానికులకు టికెట్‌ ఇవ్వాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇలా జనగామలో.. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో టికెట్లు.. సీట్ల లొల్లి బయటపడడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కేటీఆర్‌ ఇవాళ అమెరికా టూర్‌కు వెళ్తుండడం.. ఆయన 15 రోజుల వరకు అక్కడే మకాం వేస్తుండడంతో.. అందరి దృష్టి కేసీఆర్‌పై పడింది. ఈ వివాదాల్ని కేసీఆర్‌ ఎలా పరిష్కరిస్తారోనంటూ ఉత్కంఠ నెలకొంది.

Tags

Next Story