ప్రమాణస్వీకారానికి భారీ భద్రత

ప్రమాణస్వీకారానికి భారీ భద్రత
భారీగా ప్రజలు వస్తారన్న అంచనాతో పటిష్ట బందోబస్తు.... ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్‌, డీజీపీ

తెలంగాణలో కొత్త సర్కార్ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం LB స్టేడియంలో కొత్త ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. CMతో పాటు 9 నుంచి 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కార్యక్రమం కోసం పోలీసులు కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఉదయం పదిన్నరకు ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత నిర్ణయించినా ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్డేడియంలో ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, DGP రవీగుప్త, ఉన్నతాధికారులు పరిశీలించారు. అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మహేశ్ కుమార్ గౌడ్ , అంజనీకుమార్, వసంతకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి సహా పార్టీలోని సీనియర్ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాణస్వీకారానికి మొత్తం 3 వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత అయోధ్యరెడ్డి తెలిపారు.

రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి పెద్దఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకనుగుణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రముఖుల రాక, పెద్దఎత్తున జనం తరలిరానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న డీజీపీ రవిగుప్తా... ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతంలో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. దాదాపు లక్ష మంది సభకు హాజరు కావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్న డీజీపీ... ఎల్బీ స్టేడియంలో 30 వేల మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉందని తెలిపారు. మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.


మరోవైపు రేవంత్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం పట్ల ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో నరసింహారెడ్డి- రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ ఐదో సంతానంగా జన్మించారు. ఏటా దసరా పండుగకు రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా హాజరవుతుంటారు. ఈ ఏడాది దసరా వేడుకల్లోనూ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టిన తర్వాతే పార్టీ పరుగులు పెట్టిందని, ఆయన ముఖ్యమంత్రి అవుతారని ముందుగానే ఊహించామని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. గత పాలకులు రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని, ప్రగతి అంటే ఏమిటో రేవంత్ పాలనలో ప్రజలకు అర్థమవుతుందని ఆయన సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

Tags

Next Story