నేడు నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌

నేడు నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తిచేయనున్నారు. మొత్తం 824 ఓట్లకు 823 ఓట్లు పోలయ్యాయి. రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వీటిలో మొదటి రౌండ్‌లో 600 ఓట్లు, రెండో రౌండ్‌లో 223 ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం 6 టేబుళ్లను ఏర్పాటు చేశారు. యాభై పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను బ్యాలెట్ బాక్సుల నుంచి ఒకచోట కుప్పగా పోస్తారు. ఆ తర్వాత వ్యాలిడ్ ఓట్లను గుర్తిస్తారు. 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. ఆ తర్వాత లెక్కించడం ప్రారంభిస్తారు. అయితే ఉదయం 11 గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం ఒక్కో పార్టీ నుంచి 8 మంది చొప్పున కేంద్రాల్లోకి అనుమతిస్తారు. టీఆర్‌ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి పోతాంకర్ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగింది. మొత్తం 50 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో 67 మంది, అత్యల్పంగా చందూర్‌లో నలుగురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించారు. పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్, సమస్యాత్మకంగా గుర్తించిన 14 స్టేషన్‌లలో వీడియో షూటింగ్‌తో పాటు వెబ్ క్యాస్టింగ్‌ నిర్వహించారు..

బలాబలాల ప్రకారం చూస్తే ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు లాంఛనమే కానుంది. మొత్తం 824 మంది ఓటర్లలో.. 49 జెడ్పీటీసీలు, 535 ఎంపీటీసీలు, 226 మంది కౌన్సిలర్లు, 12 మంది ఇతరులున్నారు. పార్టీల పరంగా బలాలు చూస్తే టీఆర్‌ఎస్‌కు 494, కాంగ్రెస్‌కు 140, బీజేపీకి 84, స్వతంత్రులు 66, MIMకు 28 ఓట్లున్నాయి. 99.64 శాతం పోలింగ్ జరగడంతో గెలుపుపై గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్‌ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడటంతో... ఈ ఉప ఎన్నిక వచ్చింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ఉంటూ... సాధారణ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో.. భూపతిరెడ్డిని బర్తరప్‌ చేశారు. దీంతో అప్పటి నుంచి ఖాళీ ఏర్పడింది. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీ 2022 వరకు అధికారంలో కొనసాగుతారు.

Tags

Read MoreRead Less
Next Story