Tomato Price: జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న టమాట రేట్లు.. రికార్డు బ్రేక్ ధరలతో..

Tomato Price (tv5news.in)
X

Tomato Price (tv5news.in)

Tomato Price: దేశవ్యాప్తంగా టమాటా ధరలు మంట పుట్టిస్తున్నాయి.

Tomato Price: దేశవ్యాప్తంగా టమాటా ధరలు మంట పుట్టిస్తున్నాయి. రేట్లు పెట్రోల్‌ ను మించి పరుగులు పెడుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో టమాటా సెంచరీ కొట్టేసింది. హైదరాబాద్‌ లో కేజీ టమాటా 120 రూపాయలపైనే ఉంది. టమాటా పంటకు అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఏపీలోనూ ఇదే పరిస్థితి. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన చిత్తూరు జిల్లా మదనపల్లిలో కేజీ టమాట ధర 150 దాటి ఆశ్చర్యపరుస్తోంది.

20 రోజుల గ్యాప్‌లోనే టమాట రేటు ఆకాశాన్నంటింది. నవంబర్ మొదట్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటా ధర కేజీ 20 నుంచి 40 రూపాయల మధ్యే ఉంది. కానీ ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో రేట్లు ఆకాశాన్నంటాయి. దేశంలోనే అత్యధిక టమాటా ఆంధ్రప్రదేశ్ లో పండుతుంది. ఇక్కడ లక్షా 43 వేల ఎకరాల్లో టమాటా సాగవుతుంది.

ఎక్కువ భాగం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే పండుతుంది. ఇక్కడ కురిసిన భారీ వర్షాలతో పంట దెబ్బతిని రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మరో నెల రోజుల వరకు టమాటా రేటు తగ్గదంటున్నారు వ్యాపారులు. పెరిగిన ధరలు జనానికి ఇబ్బందిగా ఉన్నా.. రైతులకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.

అప్పుచేసి పంట పెట్టి చాలా నష్టపోయామని.. ధరల పెరుగుదలతో అప్పులు తీరుతాయని ఆశపడుతున్నారు. ధరలు పతనమైనప్పుడు తమను ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎవరూ పట్టించుకోలేదని.. పెరిగినప్పుడు మాత్రం ఆగమేఘాల మీద ధరలు నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

Tags

Next Story