REVANTH: రుద్రారంలో తోషిబా ఫ్యాక్టరీ

REVANTH: రుద్రారంలో తోషిబా ఫ్యాక్టరీ
X
జపాన్ పర్యటనలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

జపాన్ పర్యటనలో భాగంగా టోక్యోలో జరిగిన తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రగతిని సాధించిందని, త్వరలో డ్రై పోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మూసీ ప్రక్షాళనపై బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయని ఆరోపించిన సీఎం, “సబర్మతి, గంగానదులకు రివర్ ఫ్రంట్‌లు ఉంటే.. మూసీకి ఎందుకు కాదు?” అని ప్రశ్నించారు. చెరువుల ఆక్రమణలు తొలగించకపోతే ప్రకృతి క్షమించదన్నారు.

పర్యటనలో భాగంగా టోక్యోలో సీఎం రేవంత్‌ రెండు కీలక పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ కోసం NTT డేటా, నెయిసా నెట్‌వర్క్స్ సంయుక్తంగా ₹10,500 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, రుద్రారంలో తోషిబా ₹562 కోట్లతో TTDI ఫ్యాక్టరీను ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన AI సూపర్‌కంప్యూటింగ్ మౌలిక సదుపాయంగా రూపుదిద్దుకోనుంది. పునరుత్పాదక విద్యుత్తుతో, ఆధునిక కూలింగ్ టెక్నాలజీలతో నిర్మాణం జరగనుంది. తెలంగాణను AI రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్టు కీలకమవుతుందని సీఎం తెలిపారు. ఇప్పటికే రుద్రారంలో ఉన్న తమ ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్ చేసి, పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్స్గ్యా, స్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించనుంది. టీటీడీఐ ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 562 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

పరిశ్రమలకు మరింత వేగం తేవడానికి ప్రభుత్వం డ్రై పోర్ట్ ప్రాజెక్టును తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిపారు. "ఒక రాష్ట్ర అభివృద్ధికి సముద్రాన్ని చేరే మార్గం లేకపోయినా… వ్యాపార మార్గాలు తెరవాలంటే డ్రై పోర్ట్ అవసరం. తెలంగాణలో అతి త్వరలోనే డ్రై పోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నాం. దీని ద్వారా నేరుగా దిగుమతి-ఎగుమతులకు మార్గం సుసాధ్యం అవుతుంది. ఇది రైతు నుంచి రిసెర్చ్ సైంటిస్ట్ వరకు ప్రతి ఒక్కరికి ప్రయోజనకరం," అని వివరించారు. "తెలంగాణను బెంగళూరు, ముంబయి, చెన్నై లాంటి దేశీయ నగరాలతో పోల్చడం తక్కువైతే తక్కువే. మేము లండన్, టోక్యో లాంటి మేటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం," అని ధీమాగా చెప్పారు.



Tags

Next Story