AQI: విషపూరితంగా భాగ్య నగరం

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన వాయు కాలుష్యం ప్రభావం ఇప్పుడు ఇతర ప్రధాన నగరాలకూ విస్తరిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కొన్ని రోజులుగా నగరంలో కాలుష్య స్థాయులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున వేళల్లో కాలుష్య తీవ్రత అధికంగా నమోదవుతుండటం నగర వాసుల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం తెల్లవారుజామున నగరంలోని సోమాజిగూడ ప్రాంతానికి చెందిన టీచర్స్ కాలనీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ ప్రాంతంలో AQI విలువ ఏకంగా 318గా నమోదు కావడం కలకలం రేపింది. సాధారణ పరిస్థితుల్లో గాలి నాణ్యత డబుల్ డిజిట్ లేదా గరిష్టంగా 100 లోపే ఉండాలి. అయితే ప్రస్తుతం నమోదవుతున్న స్థాయిలు ‘హాజర్డస్’ కేటగిరీకి చేరుకోవడం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది.
చలికాలం ప్రభావంతో ఏర్పడుతున్న దట్టమైన పొగమంచు, వాహనాల సంఖ్య పెరగడం వల్ల ఉద్గారాలు అధికమవడం, నిర్మాణ పనులు వంటి అంశాలు కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున 6 గంటల నుంచి 7 గంటల మధ్య కాలుష్య తీవ్రత అత్యధికంగా ఉంటోందని గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ సమయంలో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, మార్నింగ్ వాక్స్‌కు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు కళ్లలో మంట, గొంతులో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, ఆస్తమా, సైనసైటిస్, అలర్జీలతో బాధపడే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరం లేని సందర్భాల్లో ఉదయం వేళల్లో బయటకు వెళ్లకపోవడం మంచిదని, బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా N95 మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే పిల్లలు, వృద్ధులు కాలుష్య ప్రభావానికి త్వరగా లోనయ్యే అవకాశముండటంతో వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లోనే గాలి శుద్ధిగా ఉండేలా చూసుకోవడం, కిటికీలు తగిన సమయంలో మాత్రమే తెరవడం వంటి జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. నగరంలో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, సంబంధిత విభాగాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
