TPCC: కేసీఆర్‌ కుట్రలను తిప్పికొట్టాలి

TPCC: కేసీఆర్‌ కుట్రలను తిప్పికొట్టాలి
24 గంటల కరెంట్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే నామినేషన్ వెనక్కి... రేవంత్‌రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి KCR సర్కార్ రైతులకు 24గంటల కరెంటిస్తున్నట్టు నిరూపిస్తే ఎన్నికల్లో వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటానని TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కేసీఆర్ కుటుంబం కుట్రలు చేస్తోందన్న ఆయన తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బహిరంగసభలకు హాజరైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామన్నారు

అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తవటంతో ప్రచారంపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగసభలు, రోడ్ షోలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. త్వరలోనే జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనుండగా.... రాష్ట్ర నేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే రోజు మూడు చోట్ల జరిగిన బహిరంగసభలకుTPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తొలుత గద్వాల జిల్లా అలంపూర్ లో పర్యటించిన రేవంత్ అలంపూర్ అభ్యర్థి సంపత్ కుమార్ తో కలిసి, జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్‌ శాంతినగర్‌లో జరిగిన ప్రజాగర్జన సభకు హాజరయ్యారు. ధరణి రద్దు చేస్తే రైతుబంధు ఆగిపోతుందన్న కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంతకుముందు రైతులకు పథకాలు అందలేదాఅని ప్రశ్నించారు.

గద్వాల్ కాంగ్రెస్ అభ్యర్థి సరితాతిరుపతయ్య నేతృత్వంలో జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు. గద్వాల పర్యటనలో పాలమూరు కష్టాలకు కాంగ్రెస్ కారణమన్న సీఎం కేసీఆర్ విమర్శలపై రేవంత్ మండిపడ్డారు. జూరాల, బీమా, నెట్టెంపాడు లాంటి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించినందుకు ఇబ్బందులొచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ చూసి భారాస బెంబేలెత్తిపోతోందన్నారు. ఆర్డీఎస్‌ సమస్యను పరిష్కరించే బాధ్యతను సంపత్‌ కుమార్‌, తాను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్‌ పథకం తీసుకొచ్చేందే కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తు చేశారు. ధరణి పోర్టల్‌ భారాసకు ఏటీఎంలా మారిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మరింత మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జోగులాంబ ఆలయం అభివృద్ధి గురించి భారాస ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అలంపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇస్తున్నట్టు నిరూపిస్తే.. తాను నామినేషన్‌ వేయనని సవాల్‌ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story