CM: ముఖ్యమంత్రిని కలిసిన మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన చీఫ్ గా నియమితులైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం జూబ్లీహిల్స్ లోని నివాసంలో రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు రేవంత్ అభినందనలు తెలిపారు.
డిప్యూటీ సీఎంను కూడా
ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టీపీసీసీ నూతన చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కలిశారు. మహేశ్ కుమార్ గౌడ్‌కు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. వినాయకచవితి సందర్భంగా భట్టికి వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, కార్పొరేషన్ ఛైర్మన్లు అనిల్ కుమార్, శివసేన రెడ్డి, అన్వేష్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ పీసీసీ ఛీప్‌గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. రెండు వారాల క్రితమే ఏఐసీసీ.. ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. తాజాగా శుక్రవారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
టీపీసీసీ చీఫ్ గా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రస్థానం NSUI నుండి మొదలయ్యింది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే విద్యార్థి దశలో NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. అలా అలా కాంగ్రెస్ నేతలతో సాన్నిహిత్యం పెరిగి కాంగ్రెసు నాయకునిగా ఎదిగారు.
ఎంపిక అభినందనీయం’
పీసీసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడం పట్ల ఆర్మూర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చిల్క కిష్టయ్య ఆత్మీయ మిత్రుడిని ఎంపిక చేసినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. సరైన నాయకున్ని ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు సంబరాలు నిర్వహించుకుంటున్నాయని అన్నారు. రాష్ట్ర పీసీసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు చిల్క కిష్టయ్య శుభాకాంక్షలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com