నేడు పొంగులేటి, జూపల్లితో TPCC ఛీఫ్‌ రేవంత్‌ భేటీ

నేడు పొంగులేటి, జూపల్లితో TPCC ఛీఫ్‌ రేవంత్‌ భేటీ
తెలంగాణలో పొలిటికల్ హీట్‌ పెరిగింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు తమ బలం పెంచుకునే పనిలో పడ్డాయి

తెలంగాణలో పొలిటికల్ హీట్‌ పెరిగింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు తమ బలం పెంచుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో చేరికల కోసం వ్యూహాలకు పదును పడుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ వీరిద్దరిని TPCC చీఫ్ రేవంత్ రెడ్డి నేడు కలవనున్నారు. మధ్యాహ్నం ఇద్దరు నేతలతో రేవంత్ సమావేశమై, పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతోను రేవంత్ భేటీ కానున్నారు. ఈ విషయమై ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

పొంగులేటి, జూపల్లిలను BRS బహిష్కరించిన అనంతరం వారు BJPలోకి వెళ్తారని.. కాదు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. ప్రారంభంలో BJP వైపు మొగ్గు చూపినట్లుగా కనిపించింది. వారితో BJP నేత ఈటల రాజేందర్ కూడా చర్చలు జరిపారు. అయితే ఖమ్మం జిల్లాలో BJPకి అంతగా పట్టు లేకపోవడంతో పొంగులేటి కాంగ్రెస్ దిశగా చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొంత కాలం క్రితం ఈటల చేసిన వ్యాఖ్యలు కూడా దీనిని ధ్రువీకరిస్తున్నాయి. ఇక జూపల్లి గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ వారితో భేటీ కానున్నారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story