Telangana: రైతాంగానికి రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Telangana: రైతాంగానికి  రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
రుణమాఫీ ఉండదన్న విషయంపై స్పష్టత వచ్చేసిందన్నారు

తెలంగాణ రైతాంగానికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ, కేసీఆర్‌ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపునిచ్చారు. రైతుతో రాజకీయం చేయడానికి బీఆర్‌ఎస్‌ బయల్దేరిందని విమర్శించారు. రైతు వేదికల్ని ఇన్నాళ్లు అలంకారప్రాయంగా ఉంచిన ఆ పార్టీ.. ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చేందుకు బరితెగించిందని ఆరోపించారు. రుణమాఫీ కోసం ఇన్నాళ్లూ మనం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూశామన్న ఆయన.. చివరి బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టడం అయిపోయిందన్నారు. ఇక రుణమాఫీ ఉండదన్న విషయంపై స్పష్టత వచ్చేసిందని రేవంత్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య 31 లక్షలని.. 20వేల కోట్ల మేర మాఫీ చేయాల్సిన ప్రభుత్వం.. రైతులను నిలువునా మోసం చేసిందని రేవంత్‌ ఆరోపించారు. అప్పులు ఊబిలో చిక్కిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని.. జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు.

రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదని రేవంత్‌ అన్నారు. సబ్ స్టేషన్లలోని లాగ్ పుస్తకాలే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ఉలిక్కి పడిన ప్రభుత్వం అన్ని సబ్ స్టేషన్లలో లాగ్ బుక్‌లను వెనక్కు తెప్పించిందని చెప్పారు.

ప్రతి గింజా కొంటామని ప్రగల్భాలు పలికే ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం చాలా ఆలస్యంగా తెరిచిందన్నారు. అష్టకష్టాలు పడి కేంద్రాలకు ధాన్యం తెచ్చినా.. వారం రోజుల వరకు కాటా వేయలేదని రేవంత్‌ పేర్కొన్నారు. తరుగు, తాలు పేరుతో ఐదు నుండి పది కిలోల మేర దోపిడీ జరిగినా ప్రభుత్వం స్పందించలేదని.. ధాన్యం కేంద్రాల్లో టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వర్షానికి పంట నీళ్ల పాలైన కన్నీటి బాధలు చూశామన్నారు. తూకం వేసినా లారీల కొరత పేరుతో కాలయాపన చేశారని లేఖలో ప్రస్తావించారు.

రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుండి ప్రభుత్వం లాక్కుందని రేవంత్‌ ఆరోపించారు. పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం చేతులు రాలేదని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టిందని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. నిలువునా పాతరేద్దామంటూ రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు.

Tags

Next Story