ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ లేఖ

ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ లేఖ
తెలంగాణలో పంటల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత, రైతుల పరిస్థితిని చర్చించేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. తెలంగాణలో పంటల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత, రైతుల పరిస్థితిని చర్చించేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు. పార్లమెంట్‌లో కొత్త వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంలోనూ ప్రధాని, కేంద్రమంత్రులు వ్యవసాయ చట్టాల వల్ల మద్దతు ధరలకు, కొనుగోలు కేంద్రాలను ఎలాంటి నష్టం ఉండదని పదే పదే చెప్పారన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలోను కొత్త వ్యవసాయ చట్టాల వల్ల పంటల మద్దతు ధరలకు, కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి నష్టం ఉండదని చెప్పారన్నారు ఉత్తమ్‌. తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ నాయకులు ముందుగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించారు కానీ.. డిసెంబర్‌లో ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని, హోం శాఖ మంత్రిని కలిసి వచ్చాకా రాష్ట్రంలో దాదాపు 10 వేల పంటల కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్టు ప్రకటించారని అన్నారు. అందుకు కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు కారణమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో మహిళా సంఘాలు, వ్యయసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ కొనుగోలు కేంద్రాలు మూత పడడానికి కొత్త వ్యవసాయ చట్టాలు కారణమన్నారు ఉత్తమ్‌. అంతే కాకుండా పంటలు కొనడానికి ప్రభుత్వం రైస్ మిల్లో, దాల్ మిల్లో కాదు, పంటల కొనుగోలు బాధ్యత ప్రభుత్వానిది కాదని సీఎం ప్రకటించారన్నారు. అందుకు వ్యవసాయ బిల్లులు కారణం కాగా.. ప్రధాని, హోం మంత్రితో భేటీ అయ్యాక ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. దీని వల్ల తెలంగాణలో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు.

ప్రధాని లోక్‌సభలో చేసిన ప్రసంగంలో వ్యవసాయ చట్టాల వల్ల రైతుకు మరింత లాభం జరుగుతుందని, వారు వారికి ఇష్టమున్న దగ్గర వారి ఉత్పత్తులు అమ్ముకోవచ్చని చెప్పారన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఈ చట్టాలను చూపుతూ కొనుగోలు కేంద్రాలను ఎత్తేసి పంటల కొనుగోలు, మద్దతు ధరల నుంచి ప్రభుత్వ బాధ్యతలు తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. దీని వల్ల తెలంగాణ రైతాంగం నష్టపోతోందని..ఈ విషయంలో పూర్తి సమాచారం తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరారు ఉత్తమ్‌.


Tags

Read MoreRead Less
Next Story