TPCC: మంత్రుల గొడవ.. ముగిసిన అధ్యాయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, మంచి మెజారిటీ సాధిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని మహేష్ గౌడ్ తెలిపారు. “మా ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 46 వేల ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి. ఇది మా బలం,” అని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంగా ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తున్నప్పటికీ, ఓటు చోరీ ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారని ఆయన గుర్తు చేశారు.
అది ముగిసిన అధ్యాయం
రాష్ట్రంలోని అన్ని పరిస్థితులను కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఉంచుకుందని, అందరూ దాని రాడార్‌లో ఉన్నారని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. “మంత్రుల మధ్య గొడవలు ముగిసిన అధ్యాయం. ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి,” అని ఆయన సూచించారు. కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఇటీవల జరిగిన వివాదంపై మాట్లాడుతూ, “కొందరు అలా మాట్లాడకూడదు. పోలీసుల వల్ల కొంత గందరగోళం జరిగింది, అది కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే,” అని వివరించారు. ఈ సమస్యలపై హైకమాండ్‌కు రిపోర్ట్ సమర్పించామని తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మహేష్ గౌడ్ వెల్లడించారు. ఉత్తమ్ సతీమణి డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.
"ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకిల మోత"
కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని అన్నారు. మొన్న కొండా సురేఖ బిడ్డ, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా అని తెలిపారు. క్యాబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు బట్టలూడదీసుకొని తిట్టుకున్నారట అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజల గురించి చూడటం లేదని.. వాళ్లు తన్నుకోడానికి, వాటాలు పంచుకోవడానికి సరిపోతుందని విమర్శించారు. మల్లా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. అందరిలాగా పైకి రావాలి.. మేలు జరగాలని మీరు కోరుకుంటున్నారని వడ్డెర కులస్తులను ఉద్దేశించి అన్నారు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం వడ్డెర సమాజానికి సహాయం చేసిందని తెలిపారు. సిద్దిపేటలో ట్రాక్టర్లు అందించామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్కు ఓటేయండి: కేటీఆర్
పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనను, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను బేరీజు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, బుల్డోజర్ పాలన నడుస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట డివిజన్ రిలయన్స్ జూబ్లీకేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటుచేసిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

