సోనియాగాంధీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ.. ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ తీవ్రమైంది. ఇప్పటి వరకు ఏఐసీసీ ఇంఛార్జికి మొరపెట్టుకున్న నేతలు.. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేశారు. ఏకంగా అధినేత్రితో భేటీ అవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సోనియా గాంధీని కలిశారు. తనకే పీసీసీ చీఫ్ పదవి ఎందుకివ్వాలో చెప్పుకున్నారు. పార్టీలో కొత్తగా వచ్చిన వ్యక్తులకు పీసీసీ పదవి ఇస్తే.. జరగబోయే పరిణామాలను కూడా సోనియా గాంధీకి వివరించినట్టు సమాచారం.
నిజానికి తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకాన్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేద్దామనుకుంది కేంద్ర నాయకత్వం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తరువాత పీసీసీ చీఫ్‌ను నియమించాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీసీసీ పదవి కోసం జానారెడ్డి పోటీపడుతున్నారు. పైగా నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాల్సింది కూడా జానారెడ్డినే. ఈ పరిస్థితుల్లో మరొకరికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే.. ఆయన డైరెక్షన్‌లో జానారెడ్డి నడుస్తారా అన్న అనుమానాలను ఢిల్లీ నాయకత్వం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఎవరికి పీసీసీ పదవి ఇచ్చినా.. తనను కాదని వేరే వాళ్లకి ఎలా ఇస్తారనే ఆగ్రహం మిగతా వారిలో కనిపిస్తుంది. అదే జరిగితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ ఓటమి తప్పదనేది అధినాయకత్వం భావన. పైగా అటో ఇటో అయితే జానారెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ రెడీగా ఉంది. కేంద్రస్థాయిలో మంచి స్థానం, జానారెడ్డి కుమారుడికి టికెట్ అంటూ ఆఫర్లు ఇస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిస్ధితుల్లో పీసీసీ చీఫ్‌ను నియమిస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. అందుకే, సాగర్ ఎన్నిక అయిపోయేంత వరకూ పీసీసీ చీఫ్‌ను నియమించకూడదు అని ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది.
ఓవైపు కోమటిరెడ్డి, మరోవైపు రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. పేరుకు మాత్రం డిఫెన్స్‌కు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారని చెబుతున్నారు. వాస్తవంగా అయితే.. అధిష్ఠానం పెద్దలను కలిసేందుకేనని రేవంత్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com