కాంగ్రెస్‌లో టీపీసీసీ చీఫ్ హీట్

కాంగ్రెస్‌లో టీపీసీసీ చీఫ్ హీట్
రేవంత్‌ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వొద్దంటూ నిరసన గళాలు అంతకంతకూ ఊపందుకుంటున్నాయి.

టీపీసీసీ చీఫ్‌ ఎంపిక కాంగ్రెస్ లో హీట్ పెంచుతోంది. రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మల్లుభట్టి విక్రమార్క, జగ్గారెడ్డి వంటి సీనియర్‌ నేతలు రేసులో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం కోమటిరెడ్డి, రేవంత్‌ మధ్యనే జరుగుతోంది. వీరిలో రేవంత్ రెడ్డికే పీసీసీ అధ్యక్షుడి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభిప్రాయ సేకరణలోనూ ఎక్కువ మంది రేవంత్‌ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా తుది నిర్ణయం ఏదీ వెలువడకపోవడంతో.. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ కొనసాగుతోంది.

అయితే రేవంత్‌ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వొద్దంటూ నిరసన గళాలు అంతకంతకూ ఊపందుకుంటున్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీలో ఉండనని వీహెచ్‌ స్పష్టంచేశారు. ఈ క్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవిపై వీహెచ్ తీవ్ర విమర్శలు చేశారు.

వీహెచ్ విమర్శలను మల్లు రవి తీవ్రంగా ఖండించారు. ఎవరికి చెంచాగిరి చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. 165 మంది నాయకులతో పాటు తన అభిప్రాయాన్ని సైతం హైకమాండ్‌ తీసుకుందని, రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాకు చెప్పానని తెలిపారు.

మరోవైపు వీహెచ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేసింది. వీహెచ్‌కు షోకాజ్‌ నోటీసులు కూడా ఇచ్చేందుకు ఏఐసీసీ సిద్ధమైంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి ఎంపిక ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. వీహెచ్‌ హైకమాండ్‌ వైఖరిపై మండిపడ్డారు. ఎన్ని ఓటములు ఎదురైనా తగిన చర్యలు తీసుకోవడం లేదంటూనే... రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ కూడా అమ్ముడుపోయారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఠాగూర్‌.. వీహెచ్‌ వ్యాఖ్యలపై పూర్తి నివేదిక తెప్పించుకున్నారు. అటు ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ ఏకే ఆంటోనీకి కూడా రాష్ట్రం నుంచి వీహెచ్‌ వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందాయి.


Tags

Read MoreRead Less
Next Story