
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సర్వశక్తులొడ్డుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ... ముగ్గురికి మాత్రం బీఫాంలను తాత్కాలికంగా నిలుపుదలచేసినట్లు తెలుస్తోంది. ఆ3 స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల మార్చే అవకాశమున్నట్లు పార్టీలో చర్చసాగుతోంది. మూడో జాబితా సైతం కొలిక్కి వచ్చినందున నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థులకు ఆపార్టీ నాయకత్వం బీఫాంలు పంపిణీ చేస్తోంది. రెండు విడతల్లో 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా బీఫాంతీసుకెళ్లాలని 97 స్థానాలకుచెందిన అభ్యర్థులకు గాంధీభవన్ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. వనపర్తి, బోథ్, చేవెళ్ల స్థానానికి ప్రకటించిన అభ్యర్ధులకు మాత్రం బీఫాంల సమాచారం ఇవ్వలేదని పార్టీలో చర్చసాగుతోంది. బోథ్ నుంచి వెన్నెలఅశోక్, వనపర్తి నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి, చేవెళ్ల నుంచి భరత్‌కి టికెట్లు దక్కాయి. ఆ ముగ్గురికి బీఫాం తీసుకెళ్లాల్సిందిగా గాంధీభవన్ నుంచి సమాచారం వెళ్లలేదని తెలుస్తోంది. అభ్యర్థులకు చెందిన బీఫాంలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్, ఇన్‌ఛార్జి కార్యదర్శులు, పరిశీలకులు పంపిణీ చేయగా తొలిరోజు 65మందికి అందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రెండోజాబితా ప్రకటన తర్వాత టికెట్ దక్కని ఆశావహులు తీవ్రఅసంతృప్తికి గురయ్యారు. నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం ఖరారైన వారికిసహకరించకుండా సహాయనిరాకరణ చేస్తుండగా మరికొందరు పార్టీనే వీడారు. ఇంకొందరు నిరసనబాట పట్టారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు జానారెడ్డి కమిటీతో పాటు పార్టీనేతలు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, కోదండరెడ్డి, మరికొందరు ముఖ్యనేతలు బుజ్జగింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు దిగిరాగా మరికొందరు వినేందుకు సిద్ధంగా లేకపోవటం, ముగ్గురి వరకు అసంతృప్తులు ఉన్నచోట సర్దిచెప్పటం తలకుమించిన భారంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే ఆయా నియోజకవర్గాల్లో మార్పులుచేయాలని పార్టీనాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే ఖరారైన అభ్యర్ధులపై సైతం సర్వేలు నిర్వహించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రెండో జాబితా ప్రకటన అనంతరం, తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల సామర్థాల అంచనాకు జరిపిన సర్వేల్లో 9మందిపై ఆశించినస్థాయిలో సానుకూలతలేదని గుర్తించినట్లు తెలుస్తోంది. అసంతృప్తులకు నచ్చజెప్పిన తర్వాత ఆ సంఖ్య తగ్గుతూ వచ్చినట్లు సమాచారం. మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ ప్రకటనతో ఇక్కడ టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి భాజపాలో చేరారు. ఎల్బీనగర్‌లో ముగ్గురు నాయకులను బుజ్జగించి. ప్రచారకమిటీ ఛైర్మన్ మధుయాస్కీతో కలిసి పనిచేసేట్లుగా చేయడంలో పార్టీ నాయకత్వం సఫలమైంది. కాంగ్రెస్ మూడోజాబితా ఇప్పటికే కొలిక్కివచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాలతో పొత్తులు, సీట్లు సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మిగిలిన 15 సీట్లలోనూ పార్టీ అభ్యర్థుల విషయంలో కొన్నిచోట్ల పోటీ కారణంగా జాబితా ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. రెండో జాబితాలో కొందరిని మార్చటంతో పాటు రెండు, మూడు మినహా మిగతా స్థానాలన్నింటికి ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com