AP: హైదరాబాద్‌లో శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు

AP: హైదరాబాద్‌లో శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు
యాత్ర కొనసాగే మార్గాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు... వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు

శ్రీరామనవమి వేళ ఏటా భాగ్యనగరంలో జరిగే శోభాయాత్ర ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్ర కొనసాగే మార్గాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో తాగునీటితో పాటు నిమ్మరసం, మజ్జిగ, అల్పాహారం అందించనున్నారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. శ్రీరామనవమి పురస్కరించుకొని ఏటా హైదరాబాద్‌లో సాగనున్న శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. యాత్ర సాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే GHMC, రెవెన్యూ, జలమండలి, విద్యుత్‌ తదితర శాఖల అధికారులతో హైదరాబాద్‌ CP కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శోభాయాత్ర సీతారాంబాగ్‌ శ్రీరాముడి ఆలయం వద్ద మొదలై.. మంగళ్‌హాట్‌, జాలీ హనుమాన్‌, ధూల్‌పేట్‌, పూరానాపూల్‌, జుమ్మేరాత్‌ బజార్‌, చుడీ బజార్‌, బర్తన్‌ బజార్‌, బేగంబజార్‌ ఛత్రి, సిద్యంబర్‌ బజార్‌, గౌలిగూడ చమన్‌, గురుద్వార, పుత్లిబౌలి, కోఠి మీదగా సుల్తాన్‌బజార్‌ హనుమాన్‌ వ్యాయామశాలకు చేరుకుని ముగియనుంది.


శోభాయాత్ర నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పరిధిలో 17 వ తేదీ నుంచి 18 వరకు బార్లు, మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. గోషామహల్‌, సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వాహనాలు దారి మళ్లించనున్నారు. ఊరేగింపు ప్రారంభమయ్యాక ఆసిఫ్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలను బోయిగూడ కమాన్‌ మీదగా మల్లేపల్లి చౌరస్తా, విజయ్‌నగర్‌ కాలనీ, నాంపల్లి మీదగా మెహిదీపట్నం వైపు మళ్లిస్తారు. ఫ్రెండ్స్‌ కేఫ్‌ వద్దకు చేరుకోగానే ఆఘాపుర, హబీబ్‌నగర్‌, బోయిగూడ కమాన్‌ మీదగా పంపిస్తారు. బోయిగూడ కమాన్‌ వద్దకు యాత్ర సమీపించగానే దారుస్సలాం నుంచి వచ్చే వాహనాలను ఆఘాపుర, చార్‌కండిల్‌ చౌరస్తా, నాంపల్లి మీదగా మళ్లించనున్నారు. శోభాయాత్ర చేరుకునే ప్రాంతాలు బట్టి వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. తూర్పు మండలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి పదకొండున్నర వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

వాహనదారులు, ప్రజలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు పాటించి శోభాయాత్ర సాఫీగా కొనసాగేలా సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story