KCR : జాతీయ పార్టీ ప్రకటనకు డేట్, టైం ఫిక్స్..

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 5 దసరా రోజున జాతీయ పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశమైన సీఎం కేసీఆర్...తాజా రాజకీయ పరిణామాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించారు. ఈ నెల ఐదున తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించాలని, అదే రోజున జాతీయ పార్టీ పేరు ప్రకటించాలని నిర్ణయించారు. డిసెంబరు 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
జాతీయ స్థాయిలో వివిధ సంఘాలు నేతలతో త్వరలో భేటీ కానున్నారు. జాతీయ పార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికల బరిలో ఉంటామన్నారు సీఎం కేసీఆర్. మునుగోడులో అన్ని సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్....మునుగోడులో తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.ఈ సారి మునుగోడులో మూడు జాతీయ పార్టీలు బరిలో ఉండబోతున్నాయని స్పష్టం చేశారు.
దసరా రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు జాతీయపార్టీపై ప్రకటన ఉంటుందన్నారు టీఆర్‌ఎస్ మంత్రులు. అదే రోజు పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం ఉంటుందని.... 11 గంటల వరకు అందరూ తెలంగాణ భవన్‌కు చేరుకోవాలన్నారు. దేశంలో వనరుల వినియోగంపై జాతీయ పార్టీలు విఫలయ్యాయని... టీఆర్‌ఎస్ పార్టీ జాతీయ పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశం అనంతరం... జాతీయ స్థాయిలో సభలు, సమావేశాలుపై సీఎం కేసీఆర్ వివరిస్తారన్నారు మంత్రులు.
దేశవ్యాప్తంగా రైతులు, యువత అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారు విప్ రేగా కాంతారావు. దేశంలో ఎక్కడ లేనట్టుగా తెలంగాణలో సంక్షేమ పథకాలున్నాయన్నారు. చాలా చిన్న పార్టీలను విలీనం చేస్తామని వస్తున్నారన్నారు. ఐదో తేదీ కొంతమంది జాతీయ నేతలు సమావేశానికి వస్తారన్నారు
ఇప్పటికే దేశంలోని పలువురు సీఎంలు, సామాజికవేత్తలతో కేసీఆర్ జాతీయ పార్టీ పై చర్చించారు. పార్టీ జెండా, గుర్తు విషయంలోనూ ఓ నిర్ణయానికి వచ్చారు. జాతీయ పార్టీగా TRSను ప్రకటించాలని ప్రతిపాదనలు వచ్చినా... కేసీఆర్ మాత్రం కొత్త పార్టీ ఏర్పాటుకే మొగ్గు చూపారు. జాతీయ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి - BRS, భారతీయ వికాస సమితి, నయా భారత్ వంటి పేర్లు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే... TRS ను పోలి ఉన్న భారతీయ రాష్ట్ర సమితి - BRS వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. దాదాపు ఇదే పేరు ఫైనల్ కానున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కొత్త పార్టీకి కారు గుర్తుతో పాటు గులాబీ జెండానే ఉంటుందంటున్నారు కేసీఆర్.
దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్..... అందుకు తగ్గట్టే బీజేపీకి ధీటుగా పార్టీ పేరు ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంక్షేమ పథకాలు రైతుబంధు, రైతుభీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి వంటి పథకాలు దేశమంతటా తీసుకురావాలన్న లక్ష్యంతో.. కొత్త పార్టీని పెట్టబోతున్నారు. 2024లో బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరి కేసీఆర్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com