ఈటలను ఆత్మీయంగా కౌగిలించుకున్న టీఆర్ఎస్ ఎంపీ

రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలతో కత్తులు దూసుకునే పార్టీల్లో కొనసాగుతున్నా...వ్యక్తిగతంగా మాత్రం ఆత్మీయ అనుబంధాలేనని ఆ నాయకుల చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనయుడి వివాహావేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. వేడుకలకు హాజరైన టీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకరినొకరు తారసపడ్డారు.
ఈటలను చూసిన కేకే... ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. నవ్వుతూ పలకరించారు. ఇద్దరి మధ్య సంభాషణ సరదాగా సాగింది. కేకే తన మాస్క్‌తో ఈటలను సరదాగా కొట్టడం అక్కడి వారిలో నవ్వులు పూయించింది. పార్టీలు వేరైనా..అప్పుడున్న వారిద్దరి అనుబంధం...ఇప్పుడు కూడా అలానే ఉన్నట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రేవంత్‌తో పాటు సీనియర్ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com