TRS : ప్లీనరీలో 13 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టిన టీఆర్ఎస్

TRS : టీఆర్ఎస్ మరోసారి కేంద్రాన్ని టార్గెట్ చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన పార్టీ ప్లీనరీ వేదికగా కేంద్రంపై పోరును ఉధృతం చేస్తూ టీఆర్ఎస్ సంచలన తీర్మానాలు చేసింది. బీజేపీ, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ మొత్తం 13 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలిపారు.
యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానాన్ని వ్యసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రతిపాదించారు. అనంతరం దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని ప్రతిపాదిస్తూ మంత్రి కేటీఆర్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరలను నియంత్రించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఇక.. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తీర్మానం ప్రవేశపెట్టగా... బీసీ జనగణన జరపాలని, కేంద్రంలో ప్రత్యేక బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ మధుసూదనా చారి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత తెలంగాణలో రిజర్వేషన్ శాతం పెంచాలని, ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మంత్రి మహమూద్ అలీ తీర్మానాన్ని ప్రతిపాదించారు. కేంద్రం డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని మంత్రి హరీశ్‌రావు తీర్మానం ప్రవేశపెట్టారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీర్మానాన్ని ప్రతిపాదించారు. భారత సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని ఎంపీ నామా నాగేశ్వర్‌రావు తీర్మానం ప్రవేశపెట్టారు.
తెలంగాణలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మానం ప్రతిపాదించారు. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ తీర్మానం ప్రవేశపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com