Telangana: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల రాగాలు..

Telangana: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల రాగాలు..
Telangana: తెలంగాణలో అప్పుడే ముందస్తు ఎన్నికల రాగాలు వినిపిస్తున్నాయి. బహుశా ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్‌ జిల్లాలను చుట్టేస్తున్నారని చెబుతున్నారు.

Telangana: తెలంగాణలో అప్పుడే ముందస్తు ఎన్నికల రాగాలు వినిపిస్తున్నాయి. బహుశా ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్‌ జిల్లాలను చుట్టేస్తున్నారని చెబుతున్నారు. నిన్ననే మహబూబ్‌నగర్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. ఎల్లుండి జగిత్యాల జిల్లాలో మరో సభ పెడుతున్నారు.



2 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సభలో పోడు భూముల సమస్యలు, గిరిజనబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమంపై వివిధ శాఖలతో సీఎం కేసీఆర్‌ సమీక్షలు చేస్తున్నారు. మొన్న యాదాద్రి పవర్‌ ప్లాంట్‌కు కూడా వెళ్లొచ్చారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం చేశారు.


ముందస్తు ఊహాగానాలతో రాష్ట్ర బీజేపీ కూడా వ్యూహం మార్చింది. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్.. ఆరో విడత సంగ్రామయాత్రను జస్ట్‌ 10 రోజులే చేపట్టనున్నారు. పది రోజుల్లో హైదరాబాద్‌ను చుట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. పాదయాత్రకు సమయం సరిపోనందున 119 నియోజకవర్గాల్లో బస్‌యాత్రకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. వచ్చే జనవరి నుంచి బస్‌ యాత్రకు బండి సంజయ్‌ సిద్ధమవుతున్నారు.



ఓవైపు పాదయాత్ర చేస్తూనే.. ఉదయం, రాత్రి వేళల్లో జిల్లాల నాయకత్వంతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా నాయకులకు చెబుతున్నారు. పైగా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులకు ఫ్రీహ్యాండ్‌ ఇచ్చి దూకుడు పెంచాలని బీజేపీ నిర్ణయించింది. మరోవైపు, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్ ధర్మపురి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, లక్ష్మణ్‌ వంటి ముఖ్యనేతలు ప్రజల్లో విస్తృతంగా పర్యటించేలా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


అటు తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఈమధ్యే తెలంగాణ పీసీసీ నాయకులతో సమావేశం అయ్యారు. అసమ్మతి రాగాలు సద్దుమణిగేలా కాంగ్రెస్‌లో కొత్త కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్నికలు ముందే వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.



ఒకవేళ ముందస్తు ఎన్నికలు ఖాయమైతే.. ప్రియాంక గాంధీనే నేరుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తారని చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే పార్టీల సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story