TS : మట్టిమాఫియాతో తల్లడిల్లుతున్న తల్లాడ మండలం

TS : మట్టిమాఫియాతో తల్లడిల్లుతున్న తల్లాడ మండలం
గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పేరుతో అక్రమాలు

ఖమ్మం జిల్లాలో మట్టి మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మాఫియా కన్ను పడితే చాలు పెద్ద పెద్ద కొండలైనా కరిగిపోవాల్సిందే. భారీ వాహనాలతో మట్టిని తరలిస్తూ గుట్టలను కరిగించేస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గుట్టలను కాపాడాలంటూ రైతులు అనేకమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. అధికారులు ముడుపులు తీసుకుని మాఫియాకు సహకరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం సమీపంలో రెండు పెద్ద గట్టలున్నాయి. వీటిని కనిపించకుండా చేసేందుకు ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. నిత్యం ప్రొక్లెయినర్లతో గుట్టలను తొలిచి మట్టిని మాఫియా తరలించుకుపోతోంది. వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా టన్నుల కొద్దీ మట్టిని సరిహద్దులు దాటించేస్తున్నారు. నిత్యం టిప్పర్ల రాకపోకలతో ఇక్కడి రోడ్లు ధ్వంసమైపోయాయి. దీంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ అరాచకాలపై కన్నెర్ర చేసిన రైతులు టిప్పర్లను ఆపేసి రోడ్డుపై టెంట్లు వేసుకుని ధర్నా చేశారు. పెద్ద ఎత్తున చేపడుతున్న తవ్వకాలతో మట్టి మొత్తం పొలాలను కమ్మేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పేరు చెప్పి ఇక్కడి గుట్టలను తొలిచేస్తున్నారని రైతులంటున్నారు. పగలు రేయి తేడా లేకుండా వాహనాల రాకపోకలతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పేరు చెప్పి ప్రైవేటుగా మట్టిని అమ్ముకుంటున్నారని రైతులంటున్నారు. రోడ్లు పాడవుతున్నాయని, పంటలు నష్టపోతున్నామని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గోడు వెల్లబోసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story