TS : తెలంగాణలో దూకుడు పెంచుతోన్న బీజేపీ

TS : తెలంగాణలో దూకుడు పెంచుతోన్న బీజేపీ

తెలంగాణలో బీజేపీ మరింత దూకుడు పెంచుతోంది. అధికారమే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతోంది. రాజకీయ, ప్రజా పోరాటాలతో పాటు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంలో అధికార బీఆర్ఎస్‌పై మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. ఈమేరకు హాట్‌హాట్‌గా సాగిన పార్టీ పదాధికారుల సమావేశంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ చేస్తున్న పోరాటాలను వివరించిన ఆయన.. పేపర్ లీకేజీ అంశాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేసారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో తెరవెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. పేపర్ లీకేజీకి బాధ్యుడైన మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేసేదాకా బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ తేల్చిచెప్పారు.

అటు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయంపైనా ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఎస్డీఆర్ఎఫ్ ఫండ్ నుంచి రైతులకిచ్చే పదివేల రూపాయలు కేంద్రం ఇస్తున్నదేనని బండి సంజయ్ అన్నారు. కేంద్రాన్ని కావాలనే సీఎం కేసీఆర్, మంత్రులు బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో‌‌ నష్టపోయిన రైతులకు యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరోవైపు మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ సందర్భంగా ప్రతి అసెంబ్లీలో కనీసం వంద కేంద్రాల్లో మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నేతలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు దిశానిర్దేశం చేశారు. ఇక జిల్లాల అధ్యక్షులు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లకు సునీల్ బన్సల్ గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల అధ్యక్షులు ఇచ్చిన నివేదికలతో తన దగ్గర ఉన్న రిపోర్ట్‌ను సమావేశంలో ముందుంచినట్లు సమాచారం. రెండు నెలల నుంచి ఇచ్చిన పార్టీ కార్యాచరణపై జిల్లాల అధ్యక్షులు చేసిన కార్యక్రమాలపై సునీల్ బన్సల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Next Story