TS : గవర్నర్ తమిళిసైకు ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి క్షమాపణలు

TS : గవర్నర్ తమిళిసైకు ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి క్షమాపణలు
ఇంకోసారి గవర్నర్‌ను కించపరుస్తూ మాట్లాడనని, క్షమించాలని మహిళా కమిషన్‌ను కోరారు

గవర్నర్ తమిళిసైపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తూ జాతీయ మహిళా కమిషన్‌ను క్షమాపణలు కోరారు. మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుతూ గవర్నర్ తమిళిసైకు లిఖితపూర్వకంగా లేఖ రాస్తానని మహిళా కమిషన్‌కు కౌశిక్ రెడ్డి వివరించారు. ఇన్నాళ్లు తన వ్యాఖ్యలను సమర్ధించుకున్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు తన తప్పును ఒప్పుకున్నారు. గతంలో కూడా కౌశిక్ రెడ్డి తమిళిసైపై ఎన్నోసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత నెల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని చెబుతూ అసభ్య పదజాలం ఉపయోగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కౌశిక్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. వివరణ ఇవ్వాలని ఫిబ్రవరి 12న నోటీసులు జారీ చేసింది.

కౌశిక్ రెడ్డి ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి వెంట ఆయన తరపు లాయర్ కూడా ఉన్నారు. ఇంకోసారి గవర్నర్‌ను కించపరుస్తూ మాట్లాడనని, క్షమించాలని మహిళా కమిషన్‌ను కోరారు. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని మొన్నటివరకు బీజేపీ, ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేశారు. కానీ తన వ్యాఖ్యలను కౌశిక్ రెడ్డి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. జాతీయ మహిళా కమిషన్ నుంచి నోటీసుల రావడం, ఢిల్లీలో విచారణకు హాజరైన నేపథ్యంలో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story