TS : ఎంసెట్ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు

తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష మే 12 నుంచి మొదలుకానుంది. ఈమేరకు పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా.ఎన్.శ్రీనివాసరావు ప్రకటించారు. మే 7న నీట్ పరీక్ష.. మే 7, 8, 9 తేదీల్లో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు ఉండటంతో మార్పులు చేసినట్టు చెప్పారు. అయితే ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులూ లేవన్నారు. మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అలాగే ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com