CONGRESS: పక్కా వ్యూహంతో "కాంగ్రెస్"

తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కృత నిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచీ వ్యవహరిస్తోంది. అభ్యర్థుల ఎంపిక తుదిదశకు చేరుకున్న తరుణంలో అసమ్మతి చెలరేగకుండా కాంగ్రెస్ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అసంతృప్త నేతల మధ్య సయోధ్య కుదిర్చే పనిలో భాగంగా జానారెడ్డి నేతృత్వంలోని కమిటీ సమాలోచనలు జరిపింది. జాబితా ప్రకటించిన తర్వాత ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించింది. శ్రీధర్‌బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వస్తున్న తరుణంలో జాబితా విడుదల తర్వాత అసమ్మతి చెలరేగకుండా చూడంపై కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ గాంధీభవన్‌లో సమావేశమైంది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం ఈ ఫోర్‌మన్ కమిటీని పార్టీ అధిష్ఠానం నియమించింది. జానారెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. జాబితా ప్రకటించిన తర్వాత అసంతృప్త నేతలు రాజీనామాలు చేయడం, పార్టీఅభ్యర్థికివ్యతిరేకంగా బరిలో దిగకుండా ఎలా వ్యవహరించాలనే అంశంపై సభ్యులు చర్చించారు. ప్రధానంగా అసంతృప్తులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌లో సక్రమంగా జరుగుతోందని ఒక్కో నియోజకవర్గానికి ఐదారు మంది సీట్ల కోసం పోటీపడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోతారన్న భయంతోనే KCR అభ్యర్థులను ముందుగా ప్రకటించారని కాంగ్రెస్‌కు ఆ భయంలేదన్నారు.
ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను జనంలోకి తీసుకెళ్లాని నిర్ణయించిన కాంగ్రెస్... మేనిఫెస్టో రూపకల్పనపైనా కసరత్తును కొనసాగిస్తోంది. కొన్నిరోజులుగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న శ్రీధర్‌బాబు నేతృత్వలోని కమిటీ మరోసారి గాంధీభవన్‌లో సమావేశమైంది. ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచే హామీలపై అభిప్రాయాలు సేకరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com