Dalit Bandhu Scheme : దళిత బంధు రూ.10లక్షలలో ఆ రూ.10వేలను..!

తెలంగాణ సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ రోజు పర్యటించారు. గ్రామమంతా తిరిగి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. గ్రామంలోని దళితవాడల్లో పర్యటించారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికీ తిరిగి దళితబంధు పథకం గురించి చర్చించారు. పథకం గురించి ఏమేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా వచ్చే పెద్ద మొత్తం డబ్బుతో ఎలాంటి ఉపాధి పొందుతారని దళితులను ప్రశ్నించారు సీఎం.
పెద్దమొత్తంలో వచ్చే డబ్బును వృధా చేసుకోవద్దని, స్పష్టమైన అవగాహనతో పథకం ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. అంతకుముందు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఇంటికి వెళ్లారు.. అక్కడే భోజనం చేశారు.. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వాసాలమర్రి గ్రామంలోని 76 ఎస్సీ కుటుంబాలకు దళితబంధు పథకం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
అందరికీ ఒకే విడతలో దళితబంధు నిధులు పంపిణీ చేస్తామని, అయితే ప్రతి లబ్ధిదారుని వద్ద రూ.10వేలు చొప్పున ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ డబ్బులతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. దీనివలన ఎస్సీలలో ఎవరికి ఆపద వచ్చినా.. దళిత రక్షణ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇక గ్రామంలో ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉందని, ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com