విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మినా అడిగేవారేలేరు..మంత్రులకు హరీష్‌ చురకలు

విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మినా అడిగేవారేలేరు..మంత్రులకు హరీష్‌ చురకలు
ఏపీసర్కార్‌పై మంత్రి హరీష్‌ రావు మరోసారి నిప్పులు చెరిగారు. తనపై ఏపీ మంత్రులు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారని ప్రశ్నించారు

ఏపీ సర్కార్‌పై మంత్రి హరీష్‌ రావు మరోసారి నిప్పులు చెరిగారు. తనపై ఏపీ మంత్రులు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారని ప్రశ్నించారు. తప్పులను ప్రశ్నిస్తే విమర్శిస్తారా అని నిలదీశారు. మా దగ్గర ఏముందని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని... మా వద్ద దునియానే ఉందన్నారు. 56 లక్షల ఎకరాల సాగు భూమి, రైతు బీమా, రైతు బంధు ఉందని ఏపీ మంత్రులకు చురకలంటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించింది మేమేనని హరీష్ అన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉన్నాయని అన్నారు.

ఇక మీ దగ్గర ఏ ముందో చెప్పగలరా అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు. ఆనాడు మెడలు వంచుతామన్న మీరు.. ఈనాడు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం గాలికొదిలేసిన అడగలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు.

విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మిన పట్టించుకునే వారే లేరన్నారు. ప్రజలను గాలికి వదిలేసి.. సొంత ప్రయోజనాలు చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. YCP ఏపీని ఆగం చేసిందని మండిపడ్డారు. అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఆంధ్రా మంత్రులు అనవసరంగా మా జోలికి రావొద్దని హెచ్చరించారు.

ఇక నిన్న ఏపీ కార్మికులను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో పొందాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి కార్మికుల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సందర్శంగా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. మేడే రోజున సీఎం కేసీఆర్‌ నోట కార్మికులు శుభవార్త వింటారని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. ఆంధ్ర, తెలంగాణలో పాలన చూస్తున్నారు కదా.. ఏది బాగుందో కార్మికులు చెప్పాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని సీఎం కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story