TS : NSUI నేతల్ని వెంటనే విడుదల చేయాలి : రేవంత్ రెడ్డి

TS : NSUI నేతల్ని వెంటనే విడుదల చేయాలి : రేవంత్ రెడ్డి
X

అరెస్టు చేసిన ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌ నేతల్ని వెంటనే విడుదల చేయాలని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. టెన్త్‌ పేపర్‌ లీకేజీ నేపథ్యంలో నిరసన తెలిపిన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నేతల అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనను గాలికొదిలేసి రాజకీయ విధ్వంసంలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ విచారణ కొనసాగుతుండగానే టెన్త్‌ కొశ్చన్‌ పేపర్లు కూడా బయటకురావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అటు నిరుద్యోగులు, ఇటు విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలుపుతున్న వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం దారుణమన్నారు.

వరుసగా పదో తరగతి పేపర్లు లీక్‌ అవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు రేవంత్‌ రెడ్డి. SSC బోర్డు కార్యాలయం వద్ద నిరసన తెలిపిన యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కేసీఆర్‌కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో పరీక్షలను రద్దు చేయడం కాదని, ఇక కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Next Story