తెలంగాణ ఉద్యోగుల్లో అలజడి రేపిన పీఆర్‌సీ నివేదిక

తెలంగాణ ఉద్యోగుల్లో పీఆర్‌సీ నివేదిక అలజడి రేపింది. నివేదిక సిఫారసుల్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కాయి. అన్యాయమైన సిఫారసుల్ని ప్రభుత్వం పట్టించుకోవద్దని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్‌సీ సిఫార్సులకు వ్యతిరేకంగా బీఆర్‌కే భవన్ వద్ద ఐక్యవేదిక ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఆర్‌సీ నివేదిక ప్రతుల్ని ఉద్యోగులు చింపివేశారు. తమకు న్యాయం చేయాలని నినదించారు.
ఆ తర్వాత పీఆర్‌సీపై నియమించిన త్రిసభ్య కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపారు. నివేదికపై అభ్యంతరాలను కమిటీకి వివరించారు. వేతనాలు సవరించాల్సిన కమిటీ నివేదిక... వేతనాలను తగ్గించడానికే సమర్పించినట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ఆలోచించి మంచి ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హెచ్‌ఆర్ఏ తగ్గించాలని పీఆర్‌సీ నివేదిక సిఫారసు చేయడాన్ని టీజీవోల సంఘం నేత మమత ఖండించారు. పీఆర్‌సీ సిఫారసుల్ని ప్రభుత్వం పట్టించుకోవద్దన్నారు. ఉద్యోగులు నిరాశకు గురికావొద్దని.. త్వరలోనే ప్రభుత్వం అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
అటు.. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. సంప్రదింపులు జరిపి... సంతృప్తిపడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు. గతంలో ఉద్యోగులు అడిగిన దాని కంటే ఎక్కువగానే సీఎం కేసీఆర్ ఇచ్చారని గుర్తుచేశారు.
63 శాతం ఫిట్‌మెంట్, 20 లక్షల రూపాయల గ్రాట్యుటీ ఇవ్వాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఐతే.. ఉద్యోగుల్లో ఉన్న ఆగ్రహం నేపథ్యంలో పీఆర్సీపై సర్కార్ ఏ దిశగా చర్యలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com