తెలంగాణ ఆర్టీసీకి నష్టమేమీ లేదు.. ఏపీకే కష్టాలు.. : అధికారులు

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ వివాదం ఎటూ తేలడం లేదు . కరోనా కారణంగా అంతర్ రాష్ట్ర సర్వీసులను నిలిపేసిన రెండు రాష్ట్రాలు వాటిని పుణరుద్ధరించే విషయంలో తంటాలు పడుతున్నాయి. తమ కండీషన్స్ కు ఒప్పుకుంటేనే సర్వీసులను అనుమతిస్తామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇరు సంస్థలు ఇప్పటికే పలు మార్లు చర్చలు జరిపాయి. ఏపీ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా అదనపు కిలోమీటర్లు తిప్పడంతో తెలంగాణ ఆర్టీసీ నష్టపోతుందన్నది ఇక్కడి అధికారుల వాదన. ఈ అంశంపై ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులతో సైతం చర్చలు జరిపారు. తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ ఒప్పుకోలేదు. దీంతో తమ డిమాండ్లను అంగీకరిస్తేనే బస్సులను అనుమతిస్తామంటూ తెగేసి చెబుతున్నారు తెలంగాణ ఆర్టీసీ అధికారులు..
కరోనా కారణంగా నిలిచిపోయిన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఎండీల స్థాయిలో చర్చలు జరిపినా విషయం కొలిక్కి రాలేదు. తెలంగాణలో ఏపీ సర్వీసులు 2 లక్షల 60వేల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. తెలంగాణ సర్వీసులను మాత్రం కేవలం 50 వేల కిలోమీటర్లకే పరిమితం చేశారు . అదనపు కిలోమీటర్లు తిప్పుకునేందుకు అక్కడి అధికారులు అంగీకరించడం లేదు. ఇక ప్రధాన నగరాల్లోని బస్టాపుల్లో కూడా తెలంగాణ సర్వీసులను ఎక్కువసేపు నిలవనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తాజాగా తెలంగాణ ఆర్టీసీ గత ఆరేళ్ళుగా చేస్తున్న విజ్ఞప్తులను మరోసారి తెరమీదకు తెచ్చింది. ఇరు రాష్ట్రాల్లో సర్వీసులను సమాన కిలోమీటర్లు తిప్పుకోవాలని.. తాము అడిగిన ప్రాంతాలకు బస్సులు నడుపుకునేందుకు అనుమతులు లివ్వాలని కోరింది . దసరా పండగ సమీపిస్తుండటంతో ఈ లోపే వివాదాలను పరిష్కరించుకోవాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన సర్వీసులు రెండు రాష్ట్రాల్లో చెరో లక్షా 61వేల కిలోమీటర్లు తిప్పుకునేలా ఒప్పదం చేసుకోవాలనే ప్రతిపాదన తెచ్చారు. అయితే ప్రభుత్వంతో చర్చించిన తర్వాత...తమ నిర్ణయం చెబుతామని ఏపీ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల తరువాత సమావేశం కావాలని నిర్ణయించారు..
ఇరు రాష్ట్రాల మధ్య సర్వీసులు తిరగకపోయినా తెలంగాణ ఆర్టీసీకి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదని..ఏపీకే నష్టాలు తప్పవంటున్నారు ఇక్కడి అధికారులు. తమ డిమాండ్లకు ఏపీ ఎంత త్వరగా ఓకే చెబితే అంతతొందరగా సర్వీసులు నడుపుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com