TS Transco: నేటి నుంచి ఆర్టిజన్ల సమ్మె

TS Transco: నేటి నుంచి ఆర్టిజన్ల సమ్మె
ట్రాన్స్‌కోలో క్షేత్రస్థాయిలో కీలక ఉద్యోగులైన ఆర్టిజన్లు నేటి నుంచి సమ్మె బాట పడుతున్నారు

ట్రాన్స్‌కోలో క్షేత్రస్థాయిలో కీలక ఉద్యోగులైన ఆర్టిజన్లు నేటి నుంచి సమ్మె బాట పడుతున్నారు. సమ్మె నేపథ్యంలో పలువురు ఆర్టిజన్లపై పోలీసులు కేసులు నమోదు చేయగా, ఎస్మా చట్టాన్ని కూడా ట్రాన్స్‌కో ప్రయోగించింది. అయితే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టిజన్లు స్పష్టం చేశారు. ఇక ఈ సమ్మెతో విద్యుత్‌ సరఫరాకు, సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదని, అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 18వందల మంది వరకు ఆర్టిజన్లు ఉండగా, మెజార్టీ యూనియన్లు సమ్మెకు దూరంగా ఉన్నాయి. కేవలం రెండు యూనియన్లు మాత్రమే సమ్మెలో పాల్గొంటున్నాయి

ట్రాన్స్‌కో క్షేత్రస్థాయి విధుల్లో ఆర్టిజన్లదే కీలక పాత్ర. సబ్‌స్టేషన్ల నిర్వహణ, విద్యుత్‌ కార్యాలయాల్లో ఆర్టిజన్లు అందిస్తున్న సేవలు ముఖ్యమైనవి. వీరు రెగ్యులర్‌ ఉద్యోగులు చేయలేని పనులన్నింటినీ చక్కబెడుతుంటారు. ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా వీరికి ఉద్యోగ భద్రత, కనీస వేతన అందని ద్రాక్షగానే ఉందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు విధుల నిర్వహణలో 10 మందికి పైగా ఆర్టిజన్లు మృతి చెందగా, వారి కుటుంబాలకు అందిన సాయం అంతంతేనని ఆరోపణలు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలని దీర్ఘకాలికంగా ఉద్యమిస్తున్నా ట్రాన్స్‌కో యాజమాన్యం, ప్రభుత్వం తాత్కాలిక హామీలతో ఇంతకాలం మభ్య పెడుతూ వస్తోందని మండిపడుతున్నారు. పైగా యూనియన్ల మధ్య చీలికలకు అధికారులు యత్నిస్తూ తమ ఐక్యతను బలహీనపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, చేపట్టిన సమ్మెకు పలు యూనియన్లు దూరంగా ఉండగా, తెలంగాణ విద్యుత్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, ఇతిహద్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మాత్రమే సమ్మెలో పాల్గొంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story