TS: మోడీ సర్కార్ VS కేసీఆర్ సర్కార్

మోడీ సర్కారు, కేసీఆర్ సర్కారు మధ్య పోరు ఉద్ధృతమవుతోంది. రెండు ప్రభుత్వాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కేంద్రంలో మోదీ సర్కారును టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై దీక్షకు ఎమ్మెల్సీ కవిత సిద్ధమవుతున్న వేళ.. .ఈడీ దూకుడు పెంచింది. లిక్కర్ స్కాంలో... రేపు విచారణకు హాజరుకావాలంటూ కవితకు నోటీసులు ఇచ్చింది. నిన్నే అరుణ్ పిళ్లైని అరెస్టు చేసిన ఈడీ అధికారులు... తాజాగా కవితకు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పదోతేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని భావిస్తున్న కవిత.. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈడీ నోటీసులు రావడంతో... తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. రేపు అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.
కీలక పాత్రధారిగా భావిస్తున్న హైదరాబాద్ మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఇప్పటికే అరెస్టు చేసింది ఈడీ. ప్రస్తుతం పిళ్లై ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇక... రిమాండ్ రిపోర్టులోనూ కవిత పేరును అనేక సార్లు ప్రస్తావించింది ఈడీ. పిళ్లై, ప్రేమ్‌రాహుల్‌లు కవితకు బినామీలని స్పష్టం చేసింది. పిళ్లైని రెండ్రోజుల పాటు విచారించిన తర్వాత సోమవారం అదుపులోకి తీసుకుంది. నిన్న ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. ఎమ్మెల్సీ కవిత ప్రయోజనాలను కాపాడేందుకే వ్యాపారంలో చేరినట్లు అరుణ్ పిళ్లై, ప్రేమ్‌రాహుల్ విచారణలో అంగీకరించారని తెలిపింది. కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం మేరకు భాగస్వామిగా ఉన్నారని వెల్లడించింది.
అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్ ఇద్దరూ కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి తరఫున బినామీలుగా పెట్టుబడులు పెట్టారని వెల్లడించింది. అభిషేక్, బుచ్చిబాబుతో కలిసి పిళ్లై ఢిల్లీలో 30శాతం మద్యం వ్యాపారాన్ని నియంత్రించారని పేర్కొంది. పిళ్లై ఇండో స్పిరిట్స్‌లో 3కోట్ల 40లక్షలు అధికారికంగా పెట్టుబడులు పెట్టగా.. కవిత ఆదేశాల మేరకు అందులో రూ.కోటి తిరిగి ఆయనకు చెల్లించారని తెలిపింది. సౌత్ గ్రూపు, ఆప్, విజయ్ నాయర్లకు ముడుపులు ఇచ్చినందుకే ఇండో స్పిరిట్స్‌ను పెర్నాడ్ రికార్డ్‌లో హోల్‌సేలర్‌గా నియమించారని వివరించింది. 9 రిటైల్ జోన్లను నియంత్రించిన కార్టెల్ ఏర్పాటులో పిళ్లై కీలక పాత్ర పోషించారని, సౌత్ గ్రూప్ చెల్లించిన ముడుపులను వ్యాపార కార్యకలాపాల పేరుతో తిరిగి పొందేందుకే ఈ కార్టెల్ ఏర్పడిందని తెలిపింది. ఈ కార్టెల్ ఏర్పాటులో భాగంగా ఆయన పలు సమావేశాలు నిర్వహించారని కూడా వివరించింది. ఈ సమావేశాల్లో అభిషేక్, బుచ్చిబాబు, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, శరత్‌చంద్రారెడ్డి పాల్గొన్నారని తెలిపింది
ఈ కేసులోప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ఏజెన్సీలను ప్రయోగిస్తున్నారంటూ కేసీఆర్ సహా విపక్ష నేతలు లేఖ రాసిన 24 గంటల్లోనే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పుడు ఏకంగా ఈడీ నోటీసుల రావడంతో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మోదీ సర్కారు కక్ష రాజకీయాలు చేస్తోందంటూ బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తూుంటే…. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటున్నారు బీజేపీ నేతలు. మొత్తానికి… కవితకు ఈడీ నోటీసులు రావడంతో… తెలంగాణ రాజకీయాలు ఒక్క సారిగా హీటెక్కాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com