Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల

Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఎంపిక జాబితా... ఎప్పుడు రిపోర్ట్‌ చేయాలంటే....

తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఒక ప్రకటనలో తెలిపింది. కోర్టులో కేసుల దృష్ట్యా పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేదని బోర్డు తెలిపింది. పీటీవోలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని స్పష్టంచేసింది. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు TSLPRB అధికారిక వెబ్‌సైట్‌లోని వ్యక్తిగత లాగిన్‌లలో అందుబాటులో ఉన్నాయి. అలాగే.. అభ్యర్థుల కటాఫ్‌, ఎంపికైన అభ్యర్థుల జాబితాలను https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.


పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల, రవాణా, ఆబ్కారీ శాఖలకు సంబంధించి మొత్తం 16,604 పోస్టులకుగాను 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. అర్హులు లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణించనున్నారు. తెలంగాణ పోలీసుల నియామక మండలి చేపట్టిన కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను నియామక మండలి వెబ్‌సైట్లో వ్యక్తిగత లాగిన్లలో పొందుపరచనున్నట్లు వెల్లడించింది. అలాగే కటాఫ్ మార్కుల వివరాలను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.


న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కొనసాగుతున్నందున పోలీస్ రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతోపాటు అగ్నిమాపకశాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. తుది ఎంపిక జాబితాలో చోటు దక్కిన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో అటెస్టేషన్ పత్రాలు ఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్య అందుబాటులో ఉంచనున్నారు. వాటిని డిజిటల్‌గా పూరించిన అనంతరం డౌన్లోడ్ చేసి పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను అతికించి మూడు సెట్లపై గెజిటెడ్ అధికారి సంతకాలు తీసుకోవాలని సూచించారు. ఆయా పత్రాలను ఈనెల 12, 13 తేదీల్లో నిర్ణీత కార్యాలయాల్లో సమర్పించాలని పేర్కొన్నారు.

సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులు తాము ఎంపికైన జిల్లా ఎస్పీ కార్యాలయం లేదా కమిషనరేట్లలో ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్- సీపీఎల్, రవాణా కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో టీఎస్ఎస్పీ, ఐటీ అండ్ కమ్యూనికేషన్, ఫైర్‌మెన్, ఎక్సైజ్, వార్డర్లు, రవాణా కానిస్టేబుల్ అభ్యర్థులు సంబంధిత పోలీస్ జిల్లా లేదా కమిషనరేట్ కార్యాలయంలో అటెస్టేషన్‌ పత్రాలను సమర్పించాలని బోర్డు తెలిపింది. తుది ఎంపిక ప్రక్రియపై అభ్యంతరాల నివృత్తికి మండలి అవకాశం కల్పించింది. ఈనెల 5న ఉదయం 8 గంటల నుంచి 7న సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్లోని వ్యక్తిగత లాగిన్ ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ స్థానికులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వెయ్యి రూపాయలు ఇతరులు 2వేల రూపాయలు చెల్లించాలని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story