TSPSC: టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి రాజీనామా

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్- TSPSC ఛైర్మన్ పదవికీ జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో CM రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైకి రాజీనామా లేఖ అందించారు. కమిషన్ సభ్యులు సైతం రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియపై CM రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. జనార్ధన్‌రెడ్డి రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేయగా, గవర్నర్ ఆమోదించారు. మరోవైపు కమిషన్ సభ్యులు కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం.
గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1, అసిస్టెంట్ ఇంజినీర్, AEE ప్రశ్నపత్రాలు లీకవటం కలకలం సృష్టించింది. TSPSCలో పనిచేసే ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి.. పలు ప్రశ్న పత్రాలు తస్కరించి, బయటి వ్యక్తులకు విక్రయించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమినరీ, AEE AE, DAO పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల తేదీలను మార్చింది. గత సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన వంద మందికి పైగా నిందితులను అరెస్టు చేసింది. వారు ఇకపై పరీక్షలు రాయకుండా కమిషన్ డీబార్ చేసింది. అనంతరం OMR విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. గ్రూపు సర్వీసులకు మినహా...మిగతా పరీక్షలన్నింటికి CBRT విధానంలో, ఎక్కువ మంది ఉంటే నార్మలైజేషన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు.
ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలోనూ లోపాలు జరిగాయని కొందరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లోపాలు నిజమేనని పేర్కొంటూ న్యాయస్థానం పరీక్షను రద్దుచేయడంతో కమిషన్‌పై నిరుద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికింది. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో ఛైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. TSPSC బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నియామక పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని జనార్దన్‌రెడ్డి నిర్ణయించుకోగా గత ప్రభుత్వం తిరస్కరించింది. జరిగిన పొరపాట్లను సరిదిద్ది, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించటంతో ఆయన నిర్ణయాన్ని విరమించుకున్నారు. రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను సైతం హైకోర్టు రద్దు చేయడంతో నిరుద్యోగుల్లో మరోసారి ఆగ్రహం తీవ్రమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బోర్డును ప్రక్షాళిస్తామని హామీ ఇచ్చాయి. తాజాగా ప్రభుత్వం మారడంతో ఎట్టకేలకు ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియపై CM రేవంత్‌రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్ష, గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ, గ్రూప్-3 షెడ్యూలు ఖరారు, ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షలకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com