TSPSC: గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో 562 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం అర్ధరాత్రి టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మరో ఒక పోస్టును న్యాయవివాదం నేపథ్యంలో విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. గ్రూప్-1లో టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. టాప్-10 ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి సాధించారన్నారు. తుది ఎంపికలు హైకోర్టు తుదితీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు.
హైకోర్టు కీలక తీర్పు
గ్రూప్-1 అంశంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. గ్రూప్-1 నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది. గ్రూప్-1 తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. మెయిన్స్ జవాబు పత్రాలను 8 నెలల్లో పునఃమూల్యాంకనం చేయించాలని.. లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘14 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నియామకాలు జరుగుతున్నాయి. తెలుగులో మెయిన్స్ జవాబులు రాసిన వారిపట్ల పక్షపాతం చూపించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు’’ అని కోర్టుకు ఏజీ తెలిపారు. దీనిపై సీజే జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ స్పందిస్తూ పక్షపాతం చూపించారనడానికి ఆధారాలున్నాయా?అని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని ఏజీ తెలిపారు. దీంతో సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే స్పష్టం చేశారు. విచారణకు అక్టోబర్ 15కు వాయిదా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com