TGPSC: గ్రూప్-1పై నేడే హైకోర్టు తీర్పు

గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు నేడు తుది తీర్పును వెలువరించనున్నది. ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును సోమవారానికి రిజర్వు చేసింది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ ‘కీ’లో తప్పులున్నట్టు తాము ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించామని, కాబట్టి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపీడియా, గూగుల్ ఆధారంగా ఫైనల్ ‘కీ’ని రూపొందించామని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలపడం వంటి అంశాలు తమకు అనుకూలంగా మారతాయని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. గ్రూప్-1పై హైకోర్టులో 15కుపైగా కేసులు ఉన్నాయి. వీటిలో ఫైనల్ ‘కీ’పై వేసిన కేసు అత్యంత కీలకమైనది. వీటితోపాటు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో-33పై దాఖలైన కేసు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి 503 పోస్టులు, కొత్త నోటిఫికేషన్‌లో అదనంగా చేర్చిన 60 పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై వేసిన కేసు, హైకోర్టు మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో, పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంపై వేసిన కేసులపై కూడా తీర్పు రానున్నది. ఈ నెల 16న రిజర్వేషన్లపై వేసిన మరో మూడు కేసులు సైతం హైకోర్టు ముందు విచారణకు రానున్నాయి.
నేటి నుంచి గ్రూప్ 1 హాల్ టికెట్లు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేయనుంది. అభ్యర్థులు సోమవారం నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, పరీక్షకు ఒకరోజు ముందు అంటే ఈ నెల 21 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నెల 21 నుంచి 27 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్ లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టబడింది. 7 పేపర్లకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా తెలంగాణలో మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మెయిన్స్ మొత్తం 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసి, హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలకూ తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించాల్సిందిగా కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com