TSPSC Paper Leak: అన్ని పేపర్లు లీక్ చేయాలని పక్కా ప్లాన్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. గ్రూప్-1 పేపర్ లీక్ చేయడం సక్సెస్ కావడంతో నిందితుడు ఏఈ పేపర్‌ను కూడా లీక్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈ పేపర్ లీకేజ్ కూడా సక్సెస్ అయితే వరుసగా అన్ని పేపర్లు లీక్ చేయాలని వారు పథకం వేశారని తెలిసింది. మల్టీలెవల్ స్కీం తరహాలో పేపర్ల లీకేజ్ తతంగం సాగినట్లు ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. లీక్ అయిన ఏఈ పేపర్ ఒకరి నుంచి మరొకరికి చేతులు మారినట్లు గుర్తించారు. లీకైన పేపర్‌తో పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులు అదే పేపర్‌ను మరికొందరికి అమ్మినట్లు తెలుస్తుంది. తాము కొన్న రేట్ల కంటే మరింత రేట్లకు అమ్మినట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఒక్కో అభ్యర్థికి ప్రధాన నిందితులు పదిలక్షలకు అమ్మినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. పెట్టిన డబ్బులు రాబట్టుకునేందుకు ఇంకొంత మందికి అమ్ముకున్నారు అభ్యర్థులు. అయితే ముందు ఐదు లక్షలు పరీక్ష రాసిన తరువాత ఐదు లక్షలు ఇచ్చేట్లు ఖారారు చేసుకున్నారు ప్రధాన నిందితులు. నీలేష్, గోపాల్ అనే అభ్యర్థుల నుంచి ఇంకా చాల మంది అభ్యర్థుల చేతులు మారినట్లు సిట్ తెలిపింది. అయితే ఇప్పటికే నిందితుల సంఖ్య 14కు చేరగా త్వరలో మరింత మందిని అరెస్టు చేయనున్నట్లు సిట్ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com