TSRTC : కార్లో ఊరెందుకు.. బస్సెక్కితే హ్యాపీగా.. : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

TSRTC : కార్లో ఊరెందుకు.. బస్సెక్కితే హ్యాపీగా.. : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
TSRTC : పట్నం అంతా పల్లెకు పయనమైంది. సిటీ రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. పల్లెలు కళకళలాడుతున్నాయి. సంక్రాంతి సంబరాలతో పల్లెల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

TSRTC: పట్నం అంతా పల్లెకు పయనమైంది. సిటీ రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. పల్లెలు కళకళలాడుతున్నాయి. సంక్రాంతి సంబరాలతో పల్లెల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పల్లెల్లోని ప్రతి ఇల్లూ ఆనందాల హరివిల్లైంది. సిటీలో ఉన్న కొడుకులు, కూతుళ్లు కుటుంబ సమేతంగా అమ్మ దగ్గరకొస్తే ఆమెకు ఎంత ఆనందం. పండగంతా మా ఇంట్లోనే అని పక్కింవాళ్లకు చెప్పి ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు.. ఏఏ వంటలు చేయించాలని ఎంత హడావిడిపడిపోతుంటారో.. సంక్రాంతి సందడి అంతా ఆంధ్రాలోనే కనిపిస్తుంది.. అందుకే ఎక్కడెక్కడి వారంతా అక్కడికి చేరుకుంటారు.



సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వారం రోజులు సెలవులు ప్రకటించడంతో తమ సొంత వాహనాల్లో ఊళ్లకు బయలుదేరేవారి సంఖ్య ఎక్కువైంది. దీంతో టోల్ ప్లాజా భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. రద్దీ దృష్ట్యా ఒక్క విజయవాడ మార్గంలోనే జీఎంఆర్ సంస్థ అదనంగా 10 టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ రద్దీ మాత్రం తగ్గలేదు. చౌటుప్పల్ పరిధిలోని పంతంగా టోల్ ప్లాజా వద్ద అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ ప్రయాణీకులకు నిరీక్షణ తప్పడం లేదు.


రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోవడంపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సొంత వాహనాల్లో ఊళ్లకు వెళితే ఇలాంటి సమస్యలే వస్తాయి.. అదే ఆర్టీసీ బస్సులో అయితే టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లైన్ల ద్వారా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చు. అందుకే వీలైనంత వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ప్రయత్నించండి. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణీకులను సురక్షితంగా సొంతూళ్లకు చేర్చుతారు అని సజ్జనార్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story