TSRTC: పండక్కి ఊరెళ్తున్నారా.. కాల్ చేస్తే మీ కాలనీకే..

TSRTC: తెలుగు వారి పండగ వస్తుందంటే చాలు.. ప్రతీ ఒక్కరు వారి సొంత ఊరి బాట పట్టాల్సిందే. ముఖ్యంగా సంక్రాంతి, దసరా లాంటి పండగలను సిటీలలో జరుపుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అందరూ వారి సొంత ఊళ్లకే ప్రయాణం అవుతారు. అందుకే అలాంటి సమయాల్లో బస్సుల్లో, ట్రైన్‌లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రీ బుకింగ్ చేసుకుందామంటే టికెట్లు దొరకవు, ఎలాగైనా ఊరు చేరుకుందామంటే సరిపడా బస్సులు ఉండవు. ఇదంతా దృష్టిలో పెట్టుకునే టీఎస్‌ఆర్‌టీసీ ఒక నిర్ణయానికి వచ్చింది.
దసరా సందర్భంగా ప్రజల కోసం ఆర్‌టీసీ తమ సేవలను విస్తరించింది. పండగ అనగానే ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చే ఆర్‌టీసీ ఈసారి ఒక సరికొత్త ఐడియాతో వస్తోంది. ఊళ్లకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బంది లేకుండా ఆర్‌టీసీ బస్సులను వారి ఇంటి వద్దకే పంపించడానికి సిద్ధమయ్యింది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు అన్ని డిపోలు 'ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు' ప్రకటనను ప్రచారం చేస్తున్నాయి.
@tsrtcmdoffice @JAGANGUGULOTH9 @kushaigudadepot pic.twitter.com/iU62tabYLO
— Sripathi (@Sripath48108893) October 5, 2021
సుమారు లక్షమంది దసరాకు హైదరాబాద్ నుండి బయలుదేరుతారు అని అంచనా వేసిన ఆర్‌టీసీ అక్టోబర్ 8 నుంచి 14వ తేదీ వరకు 4 వేలకు పైగా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా వ్యక్తులుగా కాకుండా పెద్ద కుటుంబంగా, బంధుగణమంతా ఒకేసారి ఊళ్లకు ప్రయాణం చేయాలనుకుంటే మన ఇంటి వద్దకే బస్సును పిలిపించుకోవచ్చనే సౌకర్యాన్ని కూడా ఆర్‌టీసీ కల్పించింది.
ఒకేచోట నుంచి 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు మరో ప్రాంతానికి వెళ్లాలనుకుంటే.. ఆర్టీసీ బస్సు వారి ఇంటి దగ్గరికి లేదా చెప్పిన చోటికి వెళ్లి పికప్ చేసుకుంటుంది. ఆర్టీసీ బస్సును ఇంటి వద్దకే రప్పించుకోడానికి ప్రయాణికులు చేయాల్సిందల్లా సంబంధిత నంబర్లకు ఫోన్ చేయడమే. ప్రయాణానికి 24 గంటల ముందు వివరాలు చెబితే మనం కోరిన చోటికే బస్సును పంపుతారు.
ప్రయాణికులు అందరికీ #RTC యాజమాన్యం తరపున దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. పండుగ సందర్భంగా 3900 అదనపు బస్సులు మరియు 1000 ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయి. ప్రజలు అందరు కూడా బస్సులో ప్రయాణం చేసి, సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరుకొని ఆనందంగా పండగను జరుపుకోండి. @TelanganaCMO pic.twitter.com/B8LnX19HNK
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 5, 2021
హైదరాబాద్ లో ఈ సేవలకు సంబంధించి ఎంజీబీఎస్, కోఠి, రేతిఫైల్ బస్టాండ్ల ఫోన్ నంబర్లను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే రానున్న ప్రతీ పండగకు ఇదే పద్ధతిలో ఇంటి వద్దకే బస్సు పంపే కార్యక్రమాన్ని కొనసాగించనుంది ఆర్‌టీసీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com