MEDARAM: మేడారం మహా జాతరకు ఆర్టీసీ సిద్ధం

MEDARAM: మేడారం మహా జాతరకు ఆర్టీసీ సిద్ధం
ఆరువేలకుపైగా బస్సులు నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ సమాయత్తం... మహిళల కోసమే ప్రత్యేక బస్సులు

మేడారం మహా జాతరకు TSRTC సమాయత్తమవుతోంది. గత జాతరలో మూడున్నర వేల బస్సులు నడిపిన సంస్థ... ఈసారి మహిళల కోసమే..ప్రత్యేకంగా..ఆరువేలకు పైగా బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ బస్సులను ఫిబ్రవరి 25 వరకు నడిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మహాజాతరకు దాదాపు 30 లక్షల మేర ప్రయాణీకులు ఆర్టీసీని వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది.


ములుగు జిల్లా మేడారం మహాజాతరకు భక్తల తాకిడి పెరుగుతోంది. తల్లుల సన్నిధికి వచ్చి.. రాష్ట్రం నుంచే కాక AP, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకుని బంగారాన్ని కానుకగా సమర్పించుకుంటున్నారు. మేడారం జాతర దృష్ట్యా RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి ..ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18 బస్టాండ్ల ద్వారా ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.

ఈ ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు..ఇతర రాష్ట్రాల నుంచి బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. గత జాతరకు లక్షా యాభై వేలకుపైగా భక్తులను చేరవేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ..మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం వల్ల దాదాపు 30 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తోంది. ఇప్పటికే మహిళలు..ఆర్టీసీ బస్సుల్లో అధిక సంఖ్యలో మేడారానికి తరలివస్తున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. ప్రభుత్వం మేడారానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల అతివలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .


బస్ పార్కింగ్, అధికారులకు వసతి, తాగునీటి సౌకర్యం, క్యాంటిన్, మరుగుదొడ్లను మేడారంలో ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కమాండ్ కంట్రోల్ రూం, కార్మికులకు 160 రెస్ట్ రూంలు నిర్మించారు. బస్సులు మెరాయించినపుడు వాటిని బాగు చేయడం కోసం 12 రిలీఫ్ వ్యాన్లు, 2 క్రేన్లను సిద్ధం చేశారు . 15 వేలకు పైగా అధికారులు సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటారని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీలత చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 30 జనసాధారణ్ రైలు సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. ఈ రైళ్లు..సికింద్రాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రాంతాల నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు నడుస్తాయి. పూర్తిగా జనరల్‌ బోగిలతోనే రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story