TSRTC Price Hike: త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగే ఛాన్స్..!

TSRTC Price Hike (tv5news.in)
TSRTC Price Hike: పెట్రో ధరల ఎఫెక్ట్ ఆర్టీసీపైనా పడింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఇప్పటికే నష్టాలతో ఎదురీదుతున్న తెలంగాణ ఆర్టీసీని.. పెరిగిన డీజీల్ ధరలు మరింత నష్టాల్లోకి నెట్టింది. ఈ నష్టాల నుంచి కొద్దిమేరకైనా గట్టెక్కడానికి ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితిలో పడింది. ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం దాదాపు సిద్దమైంది. ఛార్జీల పెంపు ఖాయమని ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ తేల్చేశారు.
రెండేళ్లుగా డీజీల్ రేట్లు 30 శాతానికి పైగా పెరిగి ఆర్టీసీపై భారం పడుతుండడంతో, టికెట్ రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. దీంతో సామాన్యుడికి ఆర్టీసీ ప్రయాణం మరింత భారం కానుంది. తెలంగాణ ఆర్టీసీ చివరగా 2019లో బస్సు ఛార్జీలను సవరించింది. ఆ సమయంలో కిలోమీటరుకు 20 పైసల మేర పెంచింది. దీనివల్ల ప్రజలపై ఏటా 550 కోట్ల భారం పడింది.
బస్సు చార్జీలు పెంచిన సమయంలో డీజిల్ ధర లీటరుకు 68 రుపాయలు ఉండగా.. ఇప్పుడది 105 రుపాయలకు చేరుకుంది. పెరిగిన ఇంధన ధరలతో ఆర్టీసీ ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చేందుకు చాలా ఇబ్బందులు పడుతోంది. కరోనా కష్టాలు కూడా తోడయ్యాయి. దీంతో కిలోమీటరుకు 15 పైసల నుంచి 30 పైసల వరకు పెంచడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని చూస్తోంది. చార్జీల పెంపు ద్వారా ప్రయాణికులపై వెయ్యి కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఛార్జీల పెంపుపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నాలుగు ప్రతిపాదనలు అందించారు. ఛార్జీల పెంపుపై నేరుగా ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఆర్టీసీ ఛార్జీలు ఏ మేర పెంచితే..ఎంత మేర నష్టం భర్తీ అవుతుందనే అంశం పైన సీఎం కార్యాలయానికి నివేదిక అందించారు. అధికారులు సమర్పించిన నాలుగు ప్రతిపాదనల్లో ప్రజల పైన తక్కువ భారం పడే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com