TSRTC: నేటి నుంచే అమల్లోకి ఆర్టీసీ ఛార్జీల పెంపు

భాగ్య నగరవాసులపై మరో పిడుగు పడనుంది. హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కనీస చార్జీపై 50 శాతం టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ అన్ని బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి చివరి దాకా రూ.10 అదనంగా ఛార్జీలు పెరగనున్నాయి. మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్-మెట్రో ఏసీ సర్వీసుల్లో అయితే మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి చివరిదాకా రూ.10 అదనంగా ఛార్జీని వసూలు చేయనుంది. పెరిగిన బస్సు ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం సిటీ బస్సు మొదటి స్టేజ్ వరకు చార్జీ రూ. 10గా ఉంటే ఇప్పుడు దానిపై మరో రూ. 5 పెంచడంతో అది రూ. 15 చేరింది. నాలుగో స్టేజీ నుంచి అదనంగా రూ. 10 వసూలు చేయనుంది. అంటే రూ.20 నుంచి రూ.30 పెరగనుంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం వచ్చాక రోజుకు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. గతంలో 11 లక్షల వరకు ప్రయాణించేవారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్లు, టీ-24 టికెట్ చార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఇప్పుడు ప్రయాణికులపై భారం మోపడానికి సిద్ధమైంది.
ఓడించారనే కక్షతోనే: కేటీఆర్
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సిటీ బస్సు కనీస ఛార్జీని ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.10 పెంచాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. పండుగ సమయంలో తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయంగా అభివర్ణించారు. పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పన్నిన కుట్ర అని కేటీఆర్ విమర్శించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో తెలంగాణ ప్రజలు అల్లాడుతున్న సమయంలో బస్సు ఛార్జీల పెంపు వారి నెత్తిన పిడుగులాంటిదని కేటీఆర్ అన్నారు. ప్రతి నిత్య ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం పడుతుందని.. బడుగుజీవులు, దినసరి కూలీలు ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ఎలా బతకాలని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com