Power Cuts: కేసీఆర్ పవర్ కట్స్ ట్వీట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేదని మహబూబ్ నగర్ ఆపరేషన్స్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి చుట్టుపక్కల విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టగా ఎలాంటి అంతరాయం లేదని స్థానికులు చెప్పినట్టు SE వెల్లడించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే సబ్ స్టేషన్ ట్రాన్స్ ఫార్మర్స్ రికార్డుల్లో నమోదు చేస్తారని, అసలు కేసీఆర్ పర్యటన సమయంలో విద్యుత్ అంతరాయమే లేదని SE స్పష్టంచేశారు.
తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతిరోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవం అందుకు భిన్నంగా ఉందని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంట్ పోయిందని సామాజిక మాధ్యం ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు. చాలా నియోజకవర్గాల్లో రోజుకు పదిమార్లు కరెంట్ పోతోందని మాజీ శాసనసభ్యులు తనకు చెప్పినట్లు తెలిపారు. కేసీఆర్ పోస్టుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కరెంటు కోతలు పెరిగిపోయాయన్న ఆరోపణలను ఖండించారు.
అసలు ఏం జరిగిందంటే .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా రెండురోజుల క్రితం మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని రాష్ట్రంలో కరెంట్ కోతలపై వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాలు మళ్లీ గుర్తు చేస్తూ తన అధికార ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అందులో తెలంగాణలో చాలా చిత్రవిచిత్రమైన ఘటనలు జరుగున్నాయని తెలిపారు. తాను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనానికి వెళ్లారని పేర్కొన్నారు. వారు తినేటప్పుడు రెండు సార్లు కరెంట్ పోయిందన్నారు.
ప్రతి రోజు సీఎం, ఉప ముఖ్యమంత్రి పవర్ కట్ అవ్వలేదని ఊదరగొడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. తనతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు విద్యుత్ పోతుందని చెప్పిన విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న హస్తం పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌పై స్పందించిన విద్యుత్ సంస్థ గులాబీ బాస్ కేసీఆర్ పర్యటన సమయంలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది. మాజీ శాసనసభ్యులు ఇంటి చుట్టుపక్కల విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారని పేర్కొంది. స్థానికులు అడగగా విద్యుత్ అంతరాయం అవ్వలేదని చెప్పారని వివరించింది. ఒకవేళ పవర్ కట్ జరిగితే సబ్ స్టేషన్ ట్రాన్స్ ఫార్మర్స్ రికార్డులలో నమోదు చేస్తామని స్పష్టం చేసింది. అసలు మాజీ ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్ పర్యటనలో అసలు కరెంట్ పోలేదని ఏర్పడలేదని విద్యుత్ శాఖ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com