TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభించింది. భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచే ఉత్తర ద్వారదర్శనార్థం ఆలయాలకు క్యూ కట్టారు. తిరుమలలో సోమవారం అర్థరాత్రి తర్వాత 1.30 గంటల నుంచి వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తొలుత వీఐపీలు వైకుంఠద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు కల్పించనున్నారు. జనవరి 8వ తేదీ రాత్రి వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులకు ఈ అరుదైన దర్శన భాగ్యం కలుగనుంది. ఏకాదశి పర్వదినాన మంగళవారం ఉదయం స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి పర్వదినం సందర్భంగా పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. మొదటి మూడు రోజులు టోకెన్లు ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుంది. రోజులో నిర్ణీత సమయాల్లో కృష్ణతేజ, ఏటీజీహెచ్ అతిథిగృహం, శిలాతోరణం మార్గాల ద్వారా భక్తులను అనుమతిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సుమారు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, పది టన్నుల పండ్లు, లక్షలాది కట్ ఫ్లవర్స్‌తో ఆలయ ప్రాంగణాన్ని ఇల వైకుంఠాన్ని తలపించేలా అలంకరించారు. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన శ్రీ రంగనాథస్వామి ఆలయ నమూనా, అష్టలక్ష్ముల సెట్టింగ్‌లు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
దర్శించుకున్న రేవంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని, ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. సోమవారం రాత్రే తిరుమలకు చేరుకున్న సీఎం, కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆలయానికి వచ్చిన సీఎం, కుటుంబ సభ్యులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల గిరులు, ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.
మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైంస్లాట్ టోకెన్ పొందినవారిని కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్‌లో ఉన్నవారిని ఏటీజీహెచ్ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి పంపిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లూ లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఇప్పటికే జారీచేసిన ఎస్‌ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

