ప్రజా యుద్దనౌక గద్దర్‌ కు టీవీ5 నివాళి

ప్రజా యుద్దనౌక గద్దర్‌ కు టీవీ5 నివాళి
గద్దర్‌ మృతిపై టీవీ5 యాజమాన్యం సంతాపం

ప్రజా యుద్దనౌక గద్దర్‌ ఇక లేరు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్‌.. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గద్దర్‌ మృతిపై టీవీ5 యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. గద్దర్‌ మృతిపై టీవీ5 యాజమాన్యం సంతాపం తెలిపింది. టీవీ5 చానల్‌లో ఏడేళ్లపాటు ప్రతి ఆదివారం నిర్విరామంగా గద్దర్‌ కార్యక్రమం కొనసాగింది. మీ పాటనై వస్తున్నా కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. పలు సామాజిక కోణాలపై టీవీ5లో గద్దర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, రైతులు, కార్మికులు, విభిన్న వర్గాల సమస్యలను ఫోకస్‌ చేస్తూ.. మీ పాటనై వస్తున్నా కార్యక్రమం కొనసాగింది. టీవీ5తో గద్దర్‌కు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందంటూ యాజమాన్యం స్మరించుకుంది. గద్దర్‌తో ఏడేళ్లపాటు కలిసి పనిచేసిన టీవీ5 ఉద్యోగులు.. ఆయన హఠాన్మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గద్దర్‌ చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా.. అందర్నీ ఆప్యాయంగా పలికరించేవారని.. ప్రేమగా మాట్లాడేవారని గుర్తు చేసుకుంటున్నారు.


వామపక్ష ఉద్యమాలతో ప్రస్థానం ప్రారంభించిన గద్దర్‌.. తన పాటతో, మాటతో ప్రజా ఉద్యమాల్లో చెరిగిపోని ముద్ర వేశారు.. తన గొంతుతో ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదారు.. హత్యాయత్నం తర్వాత తన శరీరంలో తూటా ఉన్నా.. ఆరోగ్యం సహకరించకున్నా.. ఉద్యమ పంథాను వీడలేదు.. అయితే జీవిత చరమాంకంలో అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు..



మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో జన్మించిన గద్దర్ అసలు పేరు.. గుమ్మడి విఠల్‌రావు. లచ్చమ్మ, శేషయ్య దంపతులకు 1949లో జన్మించిన గద్దర్‌ .. మొదట నిజామాబాదు జిల్లాలోని మహబూబ్‌నగర్‌లో విద్యనభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ ఓయూలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ ప్రచారం కోసం ఊరురా తిరిగారు. తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు ఎంతో ప్రోత్సహించారు.. మొదటి ఆల్బం పేరు గద్దర్.. కావడంతో విఠల్‌రావు పేరు కాస్త గద్దర్‌గా స్థిరపడింది.



పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదిరించడంతో పాటు..దళితులకు అండగా నిలిచేందుకు జననాట్యమండలి ఏర్పాటయ్యింది.. ఇందులో గద్దర్‌ ముఖ్య పాత్ర వహించారు. ఆ తర్వాత బ్యాంక్‌ ఎగ్జామ్‌లో పాస్‌ అయిన గద్దర్‌.. కెనరా బ్యాంక్‌లో క్లర్క్‌గా చేరారు.. ఉద్యోగ కాలంలోనే విమలతో వివాహం అయ్యింది.. గద్దర్‌కు ముగ్గురు పిల్లలు.. సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని పేర్లు పెట్టుకున్నారు.. 2003లో గద్దర్ కుమారుడు చంద్రుడు అనారోగ్యంతో మృతిచెందారు.



ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో సమాజంలో జరుగుతున్న ఎన్నో అరాచకాలు.. గద్దర్‌ మనసును కలిచివేశాయి.. దాంతో దళితులు, పేద వర్గాలపై జరుగుతున్న దాడులపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.. 1984లో ఉద్యోగానికి రాజీనామా చేసి..పూర్తిగా పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేశారు.. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. థోతి కట్టుకుని.. భుజంపై గొంగళి వేసుకుని..సామాన్యుడిలా ప్రజల్లో కలిసిపోయారు .. తన పాటతో జనాన్ని ఉర్రూతలూగించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో ..ఇక్కడా అక్కడా అని కాదు.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గద్దర్‌ ప్రత్యక్షమయ్యేవారు.. పాలకుల అన్యాయాలు, మోసాలు.. ప్రజలకు అర్ధమయ్యేలా పాటల రూపంలో వివరించేవారు.. సీడీలుగా వచ్చిన గద్దర్ పాటలు.. వేల సంఖ్యలో అమ్ముడుపోయేవి..



1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో గద్దర్‌ నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీగా హజరయ్యారు. గద్దర్‌ పాటలతో ఉత్తేజితులైన ఎంతో మంది యువకులు ఉద్యమంలోకి దూకారు.. అదే సమయంలో గద్దర్‌పై ఎన్నో కేసులు నమోదయ్యాయి.. నక్సలిజం వైపు యువకులను మళ్లిస్తున్నారన్న

ఆరోపణలు వచ్చాయి. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి బుల్లెట్లు దిగబడ్డాయి.. అయితే ఒక బుల్లెట్ మాత్రం గద్దర్‌ వెన్నులో చిక్కుకుపోవడంతో .. ప్రాణాపాయం కారణంగా డాక్టర్లు అలానే వదిలేశారు.. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో గద్దర్, వరవర రావును తమ దూతలుగా పంపారు నక్సలైట్లు. నకిలీ ఎన్‌కౌంటర్లను గద్దర్‌ తీవ్రంగా వ్యతిరేకించేవారు.



తెలంగాణ మలి ఉద్యమంలో గద్దర్‌ పాటలు ప్రజలను కదిలించాయి. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ.. గద్దర్‌ తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన నేతలకు గద్దర్‌ అండగా నిలిచారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ద్వారా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌ రాసిన పాటలు యువతను కదిలించాయి. జై బోలో తెలంగాణ సినిమాలో కనిపించిన గద్దర్‌.. పొడుస్తున్న పొద్దు మీద పాటను రాయడంతో పాటు .. నటించారు. అమ్మ తెలంగాణమా అనే పాట కూడా ప్రజలను ఆకట్టుకుంది. గద్దర్‌ పాటలను ఆర్‌ నారాయణమూర్తి తన సినిమాల్లోకి తీసుకున్నారు. గద్దర్‌కు నంది అవార్డు వచ్చినా ఆయన తిరస్కరించారు. మా భూమి సినిమాలో వెండితెరపై కనిపించిన గద్దర్‌.. బండెనక బండికట్టి పాటకు ఆడి పాడారు. తెలంగాణలో ఎప్పటికీ ఆ పాట ఎవర్‌ గ్రీన్‌గా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు..



తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొంత కాలం పాటు గద్దర్‌ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కమ్యూనిస్టు భావజాలంతో శ్వాసించిన గద్దర్‌.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ దేవాలయాలను కూడా సందర్శించారు.. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించి..ఎన్నికల కమిషన్‌ను కలిశారు. గద్దర్‌ ప్రజా పార్టీగా నామకరణం కూడా చేశారు.. అనారోగ్యంతో కొద్ది రోజులుగా ఇంటి పట్టునే ఉన్న గద్దర్‌ను ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ కలిశారు. ఆ తర్వాత ఆరోగ్యం విషమించడంతో గద్దర్‌ను ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ గద్దర్‌ తుది శ్వాస విడిచారు. గద్దర్‌ మరణవార్త తెలుసుకున్న ఉద్యమకారులంతా కన్నీరుమున్నీరవుతున్నారు.. గద్దర్‌ పాటలు, పోరాటాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

Tags

Next Story